Holidays For Schools And Govt Offices Under GHMC : జీహెచ్‌ఎంసీలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం మరో రెండు రోజులు సెలవులు ప్రకటించింది. విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో శుక్రవారం వరకు సెలవు ప్రకటించగా.. ఇప్పుడు మరో రెండు రోజులు పెంచడంతో శనివారం వరకు ఈ సెలవులు పొడిగించనున్నారు. ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని.. కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెండు రోజుల పాటు సెలవు ప్రకటించాలని సీఎస్‌కు సీఎం ఆదేశించారు. వైద్యం, డైరీ విభాగాల వంటి అత్యవసర సేవలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
గోదావరి నది ఉద్ధృతి.. సహాయక చర్యలపై సీఎం సమీక్ష : పరివాహక ప్రాంతంతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో పోలీసు శాఖ ప్రభుత్వ యంత్రాంగం, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అప్రమత్తం చేసి తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన పరిస్థితుల్లో చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై సీఎస్ శాంతికుమారికి సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు.
CM KCR Review On Godavari Flood : భద్రాచలంలో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న తోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. గతంలో వరదల సందర్భంగా సమర్థంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్ సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న దురిశెట్టి అనుదీప్‌ను తక్షణమే బయలుదేరి భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఎలాంటి పరిస్థితులు ఎదురైన సిద్ధంగా ఉండాలి : సచివాలయంతో పాటు, కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెవెన్యూ, పంచాయితీరాజ్, వైద్య-ఆరోగ్య, విపత్తు నిర్వహణ సహా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం.. సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ శాంతి కుమారికి తెలిపారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కంట్రోల్ రూం సహా హెలికాప్టర్లు, సంబంధిత సహాయకచర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను చేసిన అధికారయంత్రాంగం.. భద్రాచలం సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని ప్రభుత్వం తెలిపింది.
ఇవీ చదవండి :