ఎన్నికలంటే చాలు.. భారీ స్థాయిలో ఏర్పాట్లు, పార్టీ ముఖ్య నేతలతో ప్రచారాలు ఉంటాయి. ఇంకా అవసరమైతే బయట రాష్ట్రాల నుంచి నేతలను రప్పించి మరీ సభలు నిర్వహిస్తుంటాయి పార్టీలు. కానీ బంగాల్‌లో మాత్రం కాంగ్రెస్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తొలి విడత పోలింగ్ అయిపోయినప్పటికీ.. పార్టీ అగ్రనేతలు ఎవరూ ఆ రాష్ట్రంవైపు కన్నెతి కూడా చూడటం లేదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ... ఇలా ఎవరూ ఆ రాష్ట్రంలో ప్రచారాలు నిర్వహించలేదు. మరి ఇందుకు కారణాలేంటి? దీనికి కేరళ ఎన్నికలకు ఉన్న సంబంధం ఏంటి?
అంతర్గత సమస్యలు!
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నవి బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు భాజపా జాతీయ నేతలు బంగాల్‌పై దృష్టి సారిస్తుండడం, తృణమూల్ తరపున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతా తానై వ్యవహరిస్తుండటం వల్ల అక్కడి రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బంగాల్‌లో.. వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ మాత్రం.. ప్రచారంలో వెనుకబడి ఉంది. భాజపా నుంచి జాతీయ నేతలు వరుసగా పర్యటనలు చేస్తుంటే.... కాంగ్రెస్ కీలక నేతలు అసలు ఆ రాష్ట్రం వైపే చూడడం లేదు. తొలి విడత ఎన్నికలు ముగిసినా.. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా సహా మరే జాతీయ నేత.. అక్కడ ప్రచారం ఇంకా ప్రారంభించనే లేదు.
ఇదీ చూడండి:- కౌన్ బనేగా బంగాల్ టైగర్?
బంగాల్‌వైపు కాంగ్రెస్ దృష్టి సారించకపోవడానికి.. అనేక కారణాలు ఉన్నాయి. బంగాల్ రాష్ట్ర నాయకత్వానికి, ఎన్నికల కోసం నియమించిన ఇంఛార్జ్ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. బంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిర్ రంజన్ చౌదరి ఉండగా, ఇన్‌ఛార్జ్‌గా జితిన్ ప్రసాద వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని నిర్ణయాలు.. అధిర్ రంజన్ చౌదరి తీసుకుంటున్నారని, ఇన్‌ఛార్జ్‌ను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై జితిన్ ప్రసాద ఆగ్రహంతో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
రాహుల్, ప్రియాంక బంగాల్ పర్యటన ఎప్పుడని అడగ్గా.. 'నిర్ణయం తీసుకున్న తర్వాత చెబుతామని' అధిర్ అన్నారు. ఇదే విషయంపై జితిన్‌ను ప్రశ్నించగా.. 'అధిర్‌ను అడగండి' అని సమాధానమివ్వడం చర్చనీయాంశమైంది.
మరోవైపు బంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శనపై సానుకూల నివేదికలు రానందునే, పార్టీ కీలక నేతలు అక్కడ ప్రచారం నిర్వహించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
కేరళ ఎఫెక్ట్!
కాంగ్రెస్ పార్టీ నేతలు బంగాల్‌లో ప్రచారానికి రాకపోవడానికి మరో ప్రధాన కారణం కేరళ ఎన్నికలు. కేరళలో వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుండగా.. బంగాల్‌లో వారితోనే పొత్తు కుదుర్చుకుంది. అందుకే.. కేరళ ఎన్నికలు పూర్తికాక ముందు బంగాల్‌లో ప్రచారం నిర్వహించకపోవడమే మేలని.. కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి:- పూలమ్మిన చోటే.. కట్టెలమ్ముతున్న కామ్రేడ్లు!
కేరళతో పోలిస్తే, కాంగ్రెస్ బంగాల్‌లో అధికారంలో రావడానికి అంతగా అవకాశాలు లేవు. అదే సమయంలో కేరళలో మాత్రం కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్‌కు గెలవడానికి అధిక అవకాశాలున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్‌కు, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి సత్సంబంధాలే ఉన్నాయి. ఇది కూడా ఓ కారణమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
44 స్థానాలు...
బంగాల్‌లో తృణమూల్, భాజపా మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్.. 92 సీట్లలో పోటీ చేస్తోంది. వామపక్షాలు గ్రామీణ మద్దతుదారులను నమ్ముకోగా.. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 44 స్థానాలను కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు 4శాతం తగ్గిప్పటికీ.. పురులియా మాల్డా, ముర్షిదాబాద్ జిల్లాల్లో.. ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది.
బంగాల్‌లో 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే తొలి విడత ఎన్నికలు పూర్తయ్యాయి.
ఇదీ చూడండి:- బంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల