కర్ణాటక గడగ్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి తనకోసం సొంతంగా ఓ విద్యుత్ సైకిల్‌నే తయారుచేసుకున్నాడు. వొక్కలగేరికి చెందిన ప్రజ్వల్ హబీబ్.. ఎవరి సహాయమూ తీసుకోకుండానే బ్యాటరీతో నడిచే విద్యుత్ సైకిల్ తయారుచేశాడు. పాత సైకిళ్ల విడిభాగాలు వాడి ఈ సైకిల్ రూపొందించాడు. 6 రూపాయల ఖర్చుతో 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సైకిల్ ఆవిష్కర్త ప్రజ్వల్ వయసు పదహారేళ్లు.
డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్నాను. నేనో విద్యుత్ సైకిల్ రూపొందించాను. 24 వోల్టుల గేర్ మోటర్, యాక్సిలరేటర్, బ్రేక్ లివర్స్ వినియోగించి ఈ సైకిల్ తయారుచేశాను. ముంబయిలో ఒకరు ఇలాంటి సైకిలే రూపొందించారు. దాని స్ఫూర్తితో నేనూ ఒకటి కనుగొనాలని కలలు గన్నాను. మా బంధువు ఆ వీడియో పంపితే..అలాంటిదే నేనూ తయారుచేశాను.
--ప్రజ్వల్, విద్యార్థి.
ఈ సైకిల్‌కు 12 వోల్టుల రెండు బ్యాటరీలు, 12 వోల్టుల గ్రేడ్ మోటార్ అమర్చాడు. బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత విద్యుత్ సైకిల్‌గా మారుతుంది.
ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే, 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కానీ మెల్లగా నడుస్తుంది. ఛార్జింగ్ నిండేందుకు 2 గంటల సమయం పడుతుంది.
--ప్రజ్వల్, విద్యార్థి.
9 వేల రూపాయలతో ఈ సైకిల్ తయారుచేశాడు ప్రజ్వల్. ఒకవేళ మార్గమధ్యంలో బ్యాటరీ అయిపోయినా.. తొక్కుకుంటూ వెళ్లిపోవచ్చని చెప్తున్నాడు.
చిన్నప్పటినుంచీ సైకిల్ కొనివ్వమని అడుగుతూ ఉండేవాడు. ఇంకొంత కాలం ఆగమని మేం చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు ప్రజ్వల్ కళాశాల ఇంటికి కొంచెం దూరమే. నడిచి వెళ్లడం కష్టమే. సైకిల్ తయారు చేసేందుకు కావల్సిన సామగ్రి మొత్తం కొనిస్తానని వాళ్ల నాన్న హామీ ఇచ్చాడు. ఆ తర్వాత కావల్సిన ముడి సరకులు కొని, ఇంట్లోనే విద్యుత్ సైకిల్ తయారుచేశాడు.
--లీలా హబీబ్, ప్రజ్వల్ తల్లి.
రోజురోజుకీ వనరులు అంతరించిపోతున్న నేపథ్యంలో పర్యావరణ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఆ సమస్యలలకు ఇలాంటి ఆవిష్కరణలు చెక్ పెట్టి, మనకు మెరుగైన జీవనాన్ని అందిస్తాయి. ప్రజ్వల్‌ను స్థానికులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఇదీ చదవండి:'మేలు చేయాలంటే రిజర్వేషన్లేనా!'