ధైర్యరాజ్ అనే మూడు నెలల చిన్నారి వైద్యం కోసం ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా తల్లిదండ్రులు సాయం కోరగా.. 42 రోజుల్లోనే రూ.16 కోట్ల విరాళం అందింది. చిన్నారి చికిత్సకు ఇంత వేగంగా విరాళాలు సమకూరడంపై తల్లదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్లోని మహిసాగర్ జిల్లా కానేసార్ గ్రామానికి చెందిన ధైర్యరాజ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. తండ్రి వైద్యులను సంప్రదించగా.. స్పైనల్ మస్కులర్ అట్రాఫీ (వెన్నెముక కండరాల క్షీణత)తో సతమతమవుతున్న ఈ చిన్నారికి చికిత్స కోసం విదేశాల నుంచి ఇన్జెక్షన్ తెప్పించాలన్నారు. అయితే అసలు సమస్య ఇక్కడే ఉంది. ఆ ఇన్జెక్షన్ ధర అక్షరాలా రూ.16కోట్లు. చికిత్స ఎలా అందించాలా? అని ఆలోచిస్తున్న ఆ తండ్రికి ఓ ఉపాయం తట్టింది. వెంటనే ఇమ్ప్యాక్ట్ గురు అనే స్వచ్ఛంద సంస్థ సాయంతో తన కుమారుడి ఆరోగ్య స్థితి, అవసరమైయ్యే వైద్యం, అందుకు అయ్యే ఖర్చును వివరిస్తూ ప్రకటన విడుదల చేశాడు. దాతలు తన కుమారుడిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
అనూహ్య స్పందన..
మార్చి 7 నాటికి రూ.16 లక్షలే విరాళంగా వచ్చింది. కానీ స్థానిక మీడియా, సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల విరాళాలు ఊపందుకున్నాయి. మొత్తం మీద 42 రోజుల్లో 2,64,192మంది దాతలు రూ. 16,06,32,884 అందించారు. ఫలితంగా.. చిన్నారికి ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తామని చిన్నారి తండ్రి రాజ్దీప్ సింగ్ రాఠోర్ తెలిపారు.
అయితే ప్రస్తుతం వీరు ఇన్జెక్షన్పై కేంద్రం విధించే పన్నును మాఫీ పొందాలి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నందుకు గానూ కేంద్రం ఈ ఇన్జెక్షన్పై రూ.6 కోట్ల పన్ను విధిస్తుంది.
ఇదీ చదవండి : కొవిడ్ బారినపడి మరో ఎమ్మెల్యే మృతి!