కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పటినుంచి ఇప్పటివరకు మొత్తం 13,06,57,808 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్త పాజిటివ్ రేటు 6.93గా ఉందని పేర్కొంది. భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల తగ్గినట్టే కనిపించినా శుక్రవారం 10,66,022 టెస్ట్‌లు నిర్వహించగా 49,715 కొత్త కేసులు నమోదయ్యాయి.తాజాగా 564 మంది కరోనాతో మరణించారు. శుక్రవారం పాజిటివ్ రేటు 4.34శాతంగా ఉంది.
ఈ 29 రోజుల్లోనే 3కోట్లకు పైగా టెస్ట్‌లు!
కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి జులై 7 వరకు కేవలం కోటి శాంపిల్స్ మాత్రమే పరీక్షించగా జులై 7 నుంచి ఆగస్టు 3వరకు మరో కోటి పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత టెస్ట్‌ల ప్రక్రియను మరింత వేగవంతం చేసిన ఐసీఎంఆర్.. ఆగస్టు 17 నాటికి 3కోట్లు, ఆగస్టు 29 నాటికి 4కోట్లు, సెప్టెంబర్ 8 నాటికి 5కోట్లు, సెప్టెంబర్ 17 నాటికి 6 కోట్లు, సెప్టెంబర్ 26 నాటికి 7కోట్లు, అక్టోబర్ 6నాటికి 8కోట్లు, అక్టోబర్ 14 నాటికి 9కోట్లు, అక్టోబర్ 23 నాటికి 10 కోట్ల మార్కును దాటింది. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 వరకు 29 రోజుల్లో మరో 3 కోట్ల శాంపిల్స్‌ను పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు 13,06,57,808 శాంపిల్స్ పరీక్షించినట్టు వెల్లడించింది.
టెస్టులు పెంచాలి
పండగ సీజన్, చలికాలం కావటంతో కేసులు పెరిగే అవకాశం ఉందని ముందుగానే కేంద్రం అంచనా వేసింది. ఇందుకు అందుకనుగుణంగా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భారీగా టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని తాజాగా మరోసారి విజ్ఞప్తి చేసింది. ఇన్ఫెక్షన్ బారిన పడినవారిని గుర్తించి వారికి సకాలంలో చికిత్స అందిస్తే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని సూచిస్తోంది.
దీంతో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో రోజుకు సగటున 10లక్షల పరీక్షలు చేస్తున్నారు అధికారులు.
దేశంలో ప్రస్తుతం 4,39,747 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇది 4.86శాతంగా ఉంది. దేశవ్యాప్త రికవరీ రేటు ప్రస్తుతం 93.67గా ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం రికవరీ కేసుల్లో 78.19శాతం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దిల్లీ, మహారాష్ట్ర, కేరళ ముందు వరుసలో ఉన్నట్లు వివరించింది.
కొత్త కేసులు సైతం ఈ రాష్ట్రాల్లోనే అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది.
శుక్రవారం నమోదైన 564 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర, దిల్లీలో నమోదయ్యాయని వివరిచింది.