సాధారణంగా ఇంటర్మీడియట్ పూర్తి చేయాలంటే కనీసం 17 సంవత్సరాలు ఉండాలి. అలాంటిది కేవలం 12 ఏళ్ల వయసులోనే ఆ చదువును పూర్తి చేశాడు ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్నవూకి చెందిన ఓ విద్యార్థి. దీంతో అతి పిన్నవయసులో ఇంటర్ పూర్తి చేసిన బాలుడిగా చరిత్రకెక్కాడు. అయితే ఏడు, ఎనిమిది తరగతుల్లో ఉండాల్సిన వయసులో ఇంటర్ పాసవ్వడం ఏంటని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
యూపీ విద్యాశాఖ మంగళవారం పదో తరగతితో పాటు ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అతి పిన్న వయసులో ఇంటర్మీడియట్‌ను పూర్తి చేసి రికార్డు నెలకొల్పాడు 12 ఏళ్ల ఆదిత్య శ్రీకృష్ణ. ఎల్డెకో ఉద్యాన్ II కళాశాల ద్వారా పరీక్షలు రాసిన ఆదిత్య 54.4% ఉత్తీర్ణతను సాధించాడు. విశేషమేంటంటే ఆదిత్య ఇంట్లో ఉండే పరీక్షలకు సిద్ధమయ్యాడట. ఇంతకుముందు ఇదే రాష్ట్రం నుంచి అతిచిన్న వయసులో(13 ఏళ్లకే) ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థిగా సుష్మా వర్మ అనే విద్యార్థి ఉన్నారు. ప్రస్తుతం ఈ పేరిట ఉన్న రికార్డును ఆదిత్య శ్రీకృష్ణ బ్రేక్ చేశాడు.
"భవిష్యత్తులో చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్నది నా లక్ష్యం. ప్రస్తుతం దీనికోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతున్నాను. నాకు ఎకానమిక్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. అలాగే ఆర్థిక పరమైన అంశాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతాను."
- ఆదిత్య శ్రీకృష్ణ
మూడేళ్లకే అదరగొట్టిన ఆదిత్య!
ఆదిత్య తను 3 ఏళ్ల వయసు నుంచే రూబిక్స్ క్యూబ్ వంటి పజిల్ గేమ్స్ ఆడేవాడట. అదికూడా కొన్ని సెకన్లలోనే దానిని పరిష్కరించేవాడట. దీంతో అతడిలో గొప్ప టాలెంట్ ఉందని గమనించారు తండ్రి ప్రొ.పవన్ కుమార్. ఆదిత్యకు 7 సంవత్సరాలు వచ్చే సరికి జనరల్ నాలెడ్జ్, సోషల్ సైన్స్ సహా ఇతర సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో కుమారుడి ప్రతిభను చూసిన పవన్ అతడిని తదుపరి తరగతికి ప్రమోట్ చేయాల్సిందిగా ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్‌ను కోరారట. ఇందుకు ఆయన ససేమిరా అనడం వల్ల ఏకంగా సీబీఎస్ఈ ఛైర్మన్‌కు ఈ విషయమై లేఖ రాశారు ఆదిత్య తండ్రి. దీనిపై స్పందించిన బోర్డు ఛైర్మన్ నిబంధనలు అందుకు ఒప్పుకోవంటూ ముందు క్లాస్‌లోకి అడ్మిషన్ ఇచ్చేందుకు తిరస్కరించారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పవన్ మరో సెంట్రల్ బోర్డైన సీఐఎస్సీఈ ముందు కూడా తన అభ్యర్థనను ఉంచారు. అక్కడి నుంచి కూడా ఆయనకు ఇదే రకమైన స్పందన వచ్చింది. అయినప్పటికీ తన కుమారుడి క్లాస్ ప్రమోషన్ విషయంలో వెనకడుగు వేయలేదు పవన్. కొద్దిరోజుల తర్వాత అప్పటి సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ సెక్రటరీగా ఉన్న నీనా శ్రీవాస్తవను కలిశారు పవన్. ఇక్కడ కూడా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
ముఖ్యమంత్రి యోగి చొరవతో..
చివరి ప్రయత్నంగా ఏకంగా అప్పటి మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేశ్ శర్మకు లేఖ రాశారు. అనంతరం ఆయనకు మొత్తం వ్యవహారాన్ని వివరించారు. ఎట్టకేలకు ఆయనకు సానుకుల స్పందన వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకెళ్లారు డిప్యూటీ సీఎం. దీంతో పలు నిబంధనలను సడలించిన సీఎం ఆదిత్యను 9వ తరగతిలో చేర్చుకునేందుకు మార్గం సుగమం చేశారు. యోగి ఆదేశాలతో ఆదిత్యను ఎనిమిదిన్నరేళ్ల వయసులోనే తొమ్మిదో తరగతికి స్కూల్ ప్రమోట్ చేసింది. అప్పటి నుంచి నిర్విరామంగా చదువును కొనసాగిస్తూ 12 ఏళ్లకే 12వ తరగతి ఆదిత్య శ్రీకృష్ణ పాసయ్యాడు.
యూట్యూబే టీచర్!
ఆదిత్య ఇంటర్మీడియట్ కోసం ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రవేశం పొందినప్పటికీ ఎక్కువ శాతం ఇంట్లోనే ఉండి చదివేవాడు. మరోవైపు ఆదిత్య తల్లి రిచా ఓ స్కూల్ టీచర్. ఈమె హైస్కూల్ పిల్లలకు గణితం బోధించేది. అయితే కుమారుడికి ఇంటర్ పాఠాలు నేర్పించడానికి కొంత కష్టంగా తల్లికి అనిపించేది. దీంతో ఆమె అప్పుడు యూట్యూబ్‌లో 12వ తరగతికి సంబంధించిన వీడియోలను చూసి అర్థం చేసుకునేది. ఇలా అర్థం చేసుకున్న పాఠాలను కుమారుడికి అర్థమయ్యే రీతిలో సులభంగా చెప్పేది.