తమిళనాడులో విషాదం ఘటన జరిగింది. చెంగళపట్టు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 11 మంది కొవిడ్ రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి సుమారు మూడు గంటల పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
చెంగళపట్టు జిల్లాలో రోజుకు 1500 మందికిపైగా వైరస్ బారినపడుతున్నారు. 500 మందికిపైగా చెంగళపట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 10.30 గంటల నుంచి బుధవారం తెల్లవారే సరికి 11 మంది ప్రాణావాయువు అందక మృతిచెందారు. మంగళవారం ఒక్కరోజే ఈ ప్రాంతంలో అధికంగా 1608 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వారికి ఆక్సిజన్ అందించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లను ఉపయోగించింది తమిళనాడు ప్రభుత్వం. ఘటన జరిగిన మూడు గంటల తర్వాత ఆసుపత్రికి ఆక్సిజన్ అందించగలిగారు జిల్లా అధికార యంత్రాంగం. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆక్సిజన్ లేకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి:'మహమ్మారి'పై భయం వీడితేనే జయం