బంగాల్లోని ముకుందాపుర్లో నిర్జామ్ టీ పాయింట్. అక్కడ ఛాయ్ చాలా ఖరీదు. ఎంతంటే ఒక కప్పు టీ.. రూ.15 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. వెయ్యి రూపాయలకు అమ్మే ఆ టీ ఎవరు తాగుతారు అనకుంటే పొరపాటే. ఈ టీని తాగేందుకు స్థానికులే కాదు రాష్ట్రాల సరిహద్దులు దాటి వస్తుండటం గమనార్హం.
రోజువారీ ఉద్యోగ జీవితంతో విసుగు చెందిన బంగాల్‌కు చెందిన పార్థ గంగూలీ.. ఎదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. తన స్నేహితులతో సైతం ఆ అంశంపైనే చర్చిస్తుండేవారు. మిత్రుల సలహా మేరకు.. రకరకాల టీలను విక్రయించాలని నిర్ణయించారు. 2014 లో ముకుందపూర్ లోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు సమీపంలో నిర్జాస్ అనే టీ దుకాణం ప్రారంభించారు.
ఆరోగ్యకరమైన టీ...
ప్రజలకు ఆరోగ్యకరమైన టీ ఇవ్వడమే తన లక్ష్యమని చెప్తున్నారు గంగూలీ. ఇక్కడ తయారు చేసే రకరకాల టీ ల కోసం స్థానికులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు.
టీ థెరపీ ప్రారంభిస్తా...
టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అని నమ్మే గంగూలీ... రాబోయే రోజుల్లో టీతో థెరపీని ప్రారంభిస్తాను అని అంటున్నారు. ఈ డిసెంబర్లోనే అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దొరకని టీ అంటూ ఉండదు..
గంగూలీ ప్రారంభించిన దుకాణంలో దాదాపు అన్ని రకాల టీలు దొరుకుతాయి. గ్రీన్ ఛాయ్, అల్లం ఛాయ్, ఇలాచీ టీ, లవంగాలతో చేసిన తేనీరుతో అనేక రకాలు ఇక్కడ లభ్యమవుతాయి. సీజన్ల వారీగా టీ అమ్మడం ఇక్కడ ప్రత్యేకత. పార్థ గంగూలీ ఒక్క కప్పు టీని రూ. 15 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు.