పరువు హత్య కలకలం.. ప్రేమ వివాహం చేసుకున్నాడని నడిరోడ్డుపై.. - లఖింపుర్ ఖేరీ వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
Honor Killing Lakhimpur Kheri : ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్నాడని ఓ యువకుడిపై.. అతడి భార్య కుటుంబసభ్యులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కర్రలతో చితకబాది.. కాలితో తన్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడి దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. అసలేం జరిగిందంటే?
Youth Beaten To Death With Sticks : ఖమారియా సీహెచ్‌సీ వద్ద లవకుశ్ అనే యువకుడిపై.. రామ్‌జీ వర్మ, మరొక వ్యక్తి కర్రలతో బాది.. కాలితో తన్నారు. వారికి సాధన వర్మ అనే మహిళ సాయపడింది. ఇద్దరు నిందితుల దాడిలో లవకుశ్.. తీవ్రంగా గాయపడ్డాడు. దాడి సమయంలో చుట్టుపక్కల ప్రజలు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. నిందితులు పరారైన అనంతరం.. లవకుశ్ను ఖమారియా సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పోలీసు కేసు పెట్టాలని.. అప్పుడే వైద్యం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే లవకుశ్ మరణించాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. లవకుశ్ మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని.. పోస్టుమార్టం పరీక్షకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. మృతుడు ఖమారియాలోని ఓ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని వెల్లడించారు.