వైసీపీలో మరోసారి బయటపడ్డ విభేదాలు - అసమ్మతి వర్గానికి ఎమ్మెల్యే వార్నింగ్ - Differences between YCP leaders
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 4:38 PM IST
YCP Group Politics in Narasaraopeta: పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీలో వర్గ విభేదాలు రోడ్డెక్కాయి. జ్యోతి బా పూలే 133వ వర్ధంతి (Jyothi Rao Phule Death Anniversary) సందర్భంగా వైసీపీ గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా.. వైసీపీ నాయకులు వేర్వేరుగా నివాళులర్పించారు. అసమ్మతి వర్గ కార్యక్రమం అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Gopireddy Srinivasareddy) పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి అసమ్మతి వర్గం నేతల కార్యక్రమంపై విరుచుకుపడ్డారు. అసంతృప్తి నేతలకు ఎమ్మెల్యే గోపిరెడ్డి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు.
తన వద్ద పదవులు పొంది తనకే ఎదురు తిరుగుతున్నారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా.. తాను నరసరావుపేట నుంచే మరోసారి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మీరు ఎన్ని తప్పులు చేసినా ఇప్పటివరకు సహించాను, భరించానని.. ఇక నుంచి నేనేంటో చూపిస్తానని హెచ్చరించారు. అయితే రెండు రోజుల క్రితం ఇదే తరహాలో పట్టణంలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గజ్జల బ్రహ్మారెడ్డి, హనీఫ్ వర్గం ప్రత్యేకంగా ర్యాలీ నిర్వహించారు. దీంతో పట్టణంలో వైసీపీ నేతల తీరుపై ప్రజలు చర్చించుకుంటున్నారు.