Woman Suicide Due to Dowry Harassment: వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు పిల్లలు - వరకట్న వేధింపుల కారణంగా బద్వేలులో మహిళ ఆత్మహత్య
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 4:18 PM IST
Woman Dies Due to Dowry Harassment: వరకట్న వేధింపులు తాళలేక ఓ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలోని రిక్షాకాలనీలో చోటుచేసుకుంది. కట్నం కోసం అత్తింటివారే అంతం చేశారని యువతి తల్లిదండ్రులు బద్వేలులో సీఐ యుగంధర్‌కు ఫిర్యాదు చేశారు. సీకే దిన్నె మండలం రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న సుబ్బయ్య కుమార్తె సుమతి (24)తో బద్వేలు పట్టణంలోని రిక్షా కాలనీలో ఉంటున్న బాలుతో అయిదేళ్ల కిందట వివాహం జరిగింది. సుమతి భర్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నాలుగేళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లి అయిన కొన్నాళ్ల నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్తతోపాటు అత్త సుజాత, మామ నాగయ్య వేధించేవారు. గురువారం రాత్రి సుమతితో అత్తింటి వారు కట్నం కోసం గొడవ పడ్డారు. దీంతో అందరూ నిద్రిస్తున్న సమయంలో వంట గదిలోని పైకప్పునకు ఉన్న కొక్కీకి చీరతో ఉరి వేసుకుని సుమతి మృతిచెందారు. శుక్రవారం తెల్లవారుజామున కుటుంబీకులు గుర్తించి కడపలో ఉన్న సుమతి తల్లిదండ్రులకు సెల్‌ఫోన్‌లో చెప్పారు. తమ కుమార్తెను చూసి సుమతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమార్తె మృతికి అత్తింటి వారి వేధింపులే కారణమని తండ్రి సుబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అత్త, మామ, భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.