Visakha Double Death Case Updates : వారిద్దరిదీ ఒకే గ్రామం. ఇరువురి మధ్య పరిచయం అనైతిక బంధానికి దారితీసింది. కొన్నాళ్లు గుట్టుగా సాగిన వారి వ్యవహారం బయటకు పొక్కింది. ఇక అప్పటి నుంచి ఇరు కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో వారి అనైతిక బంధం అర్థాంతరంగా ముగిసిపోయింది. కానీ ఇద్దరి జీవితాలూ అంతమయ్యాయి. దీనివల్ల రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నెలకొంది.
ఆమెపరంగా తను తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. అతడిపరంగా చూస్తే వృద్ధాప్యంలో ఆసరా అవుతాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రులు దిక్కులేని వాళ్లయ్యారు. అతడి మరణంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరింత మందికి కనువిప్పు కలిగించే ఈ విషాదం లోతుల్లోకి వెళ్తే వివరాలిలా ఉన్నాయి.
విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం, కృష్ణాపురం గ్రామంలో సోమవారం ఒకే రోజు నిమిషాల వ్యవధిలో కనకల లక్ష్మి (30) అనే వివాహిత, మొకర ఆదిత్య (22) అనే యువకుడు వేర్వేరు చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిపై పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ కేసులో వారిద్దరి ఫోన్ రికార్డింగ్‌లు, ఛాటింగ్‌లు కీలకంగా మారాయి. అనైతిక బంధం కొమసాగిస్తున్న వారు కలిసి జీవించడం సాధ్యం కాదని, తనువు చాలించడమే మేలని తలచి క్షణికావేశంలో ఆదిత్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Krishnapuram Extramarital Affair Case : వెను వెంటనే లక్ష్మి సైతం తన ఇంటిలో ఉరేసుకొని మృతి చెందింది. ఆదిత్య ఉరేసుకునే సమయంలో లక్ష్మికి వీడియోకాల్ చేయడంతో భయపడి తను కూడా ఉరేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా కొంత నడిచినట్లు భోగట్టా.
- మంగళవారం మధ్యాహ్నం ఇద్దరి శవ పంచనామాలు పూర్తి కావడంతో లక్ష్మి, ఆదిత్య మృతదేహాల్ని విడివిడిగా గ్రామానికి తీసుకొచ్చి గ్రామ శివారు గోస్తనీ నదీ తీరంలోని శ్మశాన వాటికలో యాభై మీటర్ల దూరంలో విడివిడిగా దహనం చేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు సోమవారం, మంగళవారం పికెట్ నిర్వహించారు.
- ఆత్మహత్యలకు గల కారణాలపై పద్మనాభం పోలీస్ స్టేషన్ సీఐ సి.హెచ్.శ్రీధర్ తెలుపుతూ మృతురాలు లక్ష్మి, మృతుడు ఆదిత్యలకు మధ్య ఉన్న పరిచయం నేపథ్యంలో వారి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామన్నారు. ఇరువురి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.