Visakha Steel Committee protest : విశాఖలో కొనసాగుతున్న కార్మికుల దీక్ష.. నేడు అమిత్ షా పర్యటన - స్టీల్‌ప్లాంట్
🎬 Watch Now: Feature Video
Visakha Steel Conservation Committee protest : ఓ వైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన, మరో వైపు స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన నేపథ్యంలో విశాఖలో ఉత్కంఠ నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో ఉద్యోగులు కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ శిబిరానికి భారీగా చేరుకుంటున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన దీక్ష 850 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ సహా పలు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని అమిత్‌షా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జీవనాడి అయినటువంటి పరిశ్రమను ధారాదత్తం చేయొద్దని కోరారు. వేలాది మంది పోరాట ఫలితం, ఎంతో మంది నిర్వాసితుల త్యాగాల పునాదిపై ఏర్పడిన పరిశ్రమను ప్రైవేటుపరం చేయొద్దని కార్యక్రమంలో పాల్గొన్న ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు, వరసాల శ్రీనివాసురావు, వైటి దాస్, కార్మికులు, నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు.