YS Viveka case Approver Dastagiri: వాళ్లు అంతు చూస్తామని బెదిరిస్తున్నారు: దస్తగిరి - జగన్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Viveka murder case Approver Dastagiri: పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తెలిపాడు. ఈ మేరకు రాత్రి కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చిన దస్తగిరి దంపతులు.. తనకు జరిగిన అన్యాయంపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ పిల్లాడిని కిడ్నాప్ చేసి హింసించానని పులివెందుల పోలీసులు తాను, తన భార్యపైన వైసీపీ నాయకుల ఒత్తిడితో తప్పుడు కేసులు పెట్టారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాదాపు 200 మంది వైసీపీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చి తన ఇంటి వద్ద కేకలు వేశారని... అంతు చూస్తామనే రీతిలో బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కళావతి అనే మహిళ 40 వేల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అడిగినందుకు ఇంత రాద్ధాంతం చేశారని దస్తగిరి మీడియాకు తెలిపారు. తాను ఎవరినైనా బెదిరిస్తే.. తన వెంట దాదాపు 8 మంది పోలీసులు రక్షణగా ఉన్నారని.. వారిని అడిగి తెలుసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.
అవినాష్ రెడ్డి, సీఎం జగన్ కావాలనే ఏదో కేసులో ఇరికించి వివేకా కేసులో బెయిలు రద్దు చేసి జైలుకు పంపాలని చూస్తున్నారని దస్తగిరి ఆరోపించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వైసీపీ నాయకుల కుట్రలో భాగంగానే కళావతి అనే మహిళ తమ వద్ద అప్పు తీసుకున్నట్లు కనిపిస్తోందని దస్తగిరి భార్య షబానా అన్నారు. తన భర్తను ఏదో ఒకటి చేయాలనే కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోందన్నారు. తనకు సుపారీ ద్వారా వచ్చిన డబ్బులతో ఎలాంటి ఫైనాన్స్ నడపడం లేదన్న దస్తగిరి... ఆ లెక్కలన్నీ సీబీఐ అధికారుల వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా ముందుముందు మరిన్ని కేసులు పెట్టి వేధించడానికి పులివెందుల వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారన్న దస్తగిరి... వాటిని ఎదుర్కోవటానికి తాను కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. కడప ఎస్పీకి ఫిర్యాదు చేసిన అంశాలనే సీబీఐ అధికారులకు, కడప జిల్లా కోర్టు న్యాయమూర్తికి పంపామని దస్తగిరి దంపతులు తెలిపారు.