సమస్యలు ఏకరవు పెట్టిన సర్పంచులు.. ఉంగుటూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాస - General Body Meeting in unguturu
🎬 Watch Now: Feature Video
Unguturu Mandal Parishad Plenary Meeting: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులతో పాటు వైసీపీ సర్పంచులు కూడా సమస్యలపై ఏకరవు పెట్టారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించటంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందని చేబ్రోలు, ఉంగుటూరు, నారాయణపురం, కంసాలిగుంట (టీడీపీ) సర్పంచులు రాందే లక్ష్మి సునీత, బండారు సింధు, దిడ్ల అలకనంద దేవి, శాంతి వాపోయారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, కొత్తగా సచివాలయాల కన్వీనర్ వ్యవస్థలతో ప్రజల ఓట్లతో గెలిచిన తాము నిధులు, విధులు లేక ఉత్సవ విగ్రహాలుగా ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంపీపీ గంటా శ్రీలక్ష్మికి వినతి పత్రం అందజేశారు.
అధ్వానంగా ఉన్న రహదారుల మీదుగా తమ గ్రామం నుంచి మండల కార్యాలయాలకు రావాలంటే నానా అవస్థలు పడుతున్నామని కాగుపాడు (వైసీపీ) సర్పంచి కడియాల విధేష్ణ వాపోయారు. తమ గ్రామంలో జరిగే జల మిషన్ పనులను పర్యవేక్షించడానికి ఇంజనీరింగ్ సహాయకురాలు రావట్లేదని.. తిమ్మయ్యపాలెం (వైసీపీ) సర్పంచి సింహాద్రి శ్రీదేవి తెలిపారు. తమ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్స్ లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోతున్నారని అక్కుపల్లి గోకవరం (వైసీపీ) సర్పంచి మిద్దె సత్యవతి అన్నారు.