గిరిజనుల మట్టి పండగ.. వరి ధాన్యానికి పూజ.. ఆ తర్వాతే వ్యవసాయ పనులు.. - గిరిజనుల మట్టి పండగ
🎬 Watch Now: Feature Video
ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలోని గిరిజన ప్రజలు భూమిపై తమకున్న ప్రేమను ఘనంగా చాటుకుంటున్నారు. మట్టి పండగ రూపంలో భూమిని కొలుస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఈ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండగను నిర్వహించిన తర్వాతే వ్యవసాయ పనులు మొదలు పెడతారు. పండగ ప్రారంభానికి ముందురోజు గుడి ముందు ఓ గొయ్యి తీసి అందులో ఓ పందిని పాతిపెడతారు. ఆ తరువాతి రోజు నుంచే పండగ ప్రారంభమవుతుందని గ్రామస్థులు చెబుతున్నారు.
గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబం.. ఇంటి నుంచి కొంత వరి ధాన్యాన్ని తీసుకువస్తారు. దేవతకు బలి ఇవ్వడానికి కోళ్లను, మేకలను సైతం సిద్ధం చేస్తారు. పూజల అనంతరం.. అక్కడే సామూహికంగా వండుకుని తింటారు. అందరూ నేలపైనే కూర్చుంటారు. పూజ చేసిన వడ్లను ప్రసాదంగా ఇంటికి తీసుకువెళతారు. మరుసటి రోజు కొత్త మామిడికాయను, ఉల్లిగడ్డను తింటారు. దీంతో పాటు ఊరంతా కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా.. స్థానికంగా ఉన్న చెరువులో చేపలు పడతారు. శరీరానికి మట్టి పూసుకుంటారు.
ఈ కార్యక్రమాలన్ని పూర్తి అయిన తరువాత.. వ్యవసాయ పనులు మొదలు పెడతారు. పొలాలు చదును చేయటం, దున్నడం వంటివి చేస్తారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మట్టియే సర్వస్వమని అక్కడి గిరిజనులు చెబుతున్నారు. తామంతా మట్టిపైనే ఆధారపడి బతుకుతున్నామని వారంటున్నారు. మట్టి లేకపోతే తాము లేమని వెల్లడిస్తున్నారు. ఈ నేల తమకు ఎంతో ఇచ్చిందని.. అందుకే మట్టిని పూజించాలని గిరిజనులు చెబుతున్నారు.