Thieves Attack on Old Woman in Bhiminenivaripalem: రెక్కీ నిర్వహించి చోరీ.. ఒంటరి వృద్ధురాలిపై దాడి.. నగదు అపహరణ - భీమినేనివారిపాలెం తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2023, 2:45 PM IST
Thieves Attack on Old Woman in Bhiminenivaripalem: గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం భీమినేనివారిపాలెంలో హైమావతి అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. భీమినేనివారిపాలేనికి చెందిన అంజమ్మ భర్త నాలుగేళ్ల కిందట మృతి చెందడంతో.. తన తల్లి హైమావతితో కలిసి ఉంటుంది. అయితే అంజమ్మ జీవనోపాధి కోసం గేదెలను పెంచుకుంటోంది.
ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు శుభకార్యానికి పాలు కావాలని.. మాస్కులు పెట్టుకుని ద్విచక్రవాహనంపై అంజమ్మ ఇంటికి వచ్చారు. వారు చెప్పిన విషయం నిజమేనని నమ్మిన అంజమ్మ వారికి సమాధానం చెప్పింది. కాసేపటికి తాను గేదెలను మేపటానికి పొలానికి వెళ్లి వచ్చేసరికి తన తల్లి రక్తపు మడుగులో పడి ఉందని.. ఇంటి తలుపులు బలవంతంగా పగులగొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయని అంజమ్మ తెలిపారు. బీరువాలో ఉన్న 10 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆమె వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.