Road Accidents in AP Today : రాష్ట్రంలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రహదారులు రక్తమోడాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితుడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు రాజానగరం మండలం కానవరం గ్రామానికి చెందిన రిప్కో, చంద్రమ్మగా పోలీసులు గుర్తించారు.
Road Accident in Diwancheruvu : రిప్కో భర్త నాగేశ్వరరావుకి తీవ్రగాయలయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురూ పాలచర్ల నర్సరీలో కూలి పని చేసి తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బాపట్ల జిల్లా మార్టురు జాతీయ రహదారిపై మార్టూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్నఓ కారు గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నూజివీడుకు చెందిన జూలూరి శ్రీకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వంశీకృష్ణ, వివేక్‌లను చికిత్స నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లి ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన కారంచేడు పోలీస్‌స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పొలంలో పనులు ముగించుకొని ఐదుగురు కూలీలు ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో చిన్న బ్రిడ్జిని దాటుతుండగా అదుపుతప్పి ట్రాక్టర్ కాలువలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన కూలీలు బయటికొచ్చారు. అయితే అక్కడే చిక్కుకున్న డ్రైవర్ పోతురాజు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని కాపాడేందుకు అక్కడివారు సీపీఆర్ చేశారు. అనంతరం 108 వాహనంలో అతడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిక్షించిన వైద్యులు పోతురాజు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.