TDP Protest in Tanuku: రాబోయే రోజుల్లో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉరే
🎬 Watch Now: Feature Video
TDP Protest in Tanuku: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. టీడీపీ శ్రేణులు, శెట్టిబలిజ సంఘం నాయకులు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ వారి మెడలకు ఉరి తాళ్లు తగిలించుకొని నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలన్నిటికీ ఉరితాడు వేశారని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. సీఎం జగన్ పాలనలో మానవ హక్కుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన అన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి.. ఆయనను జైలులోనే ఉంచాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని రాధాకృష్ణ ఆరోపించారు. చట్టాల్ని తుంగలో తొక్కుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రజలే ఉరితాడు వేసి బంగాళాఖాతంలో కలిపేస్తారని రాధాకృష్ణ హెచ్చరించారు.