CM CBN on NITI Aayog Report: నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఏపీ డెబిట్ సస్టెయినబిలిటీలో సున్నా స్థాయిలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో అప్పుల కోసం విశాఖలో ఎమ్మార్వో కార్యాలయం కూడా తాకట్టు పెట్టారని విమర్శించారు. నీతి ఆయోగ్ దేశంలోని అన్ని రాష్ట్రాల కోసం రూపొందించిన నివేదికలో ఏపీ అట్టడుగు స్థానంలో ఉందన్నారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్-2025 నివేదికపైనా చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు.
అప్పులన్నీ ఏం చేశారో తెలియదు: 2022-23లో రాష్ట్రంలో ఆర్థిక వనరులు దారుణంగా దెబ్బతిన్నాయని, అసలు మూలధన వ్యయం చేయలేదని ఆరోపించారు. ఆరోగ్యం, విద్య తదితర సామాజిక అంశాలలో ఎక్కడా మూలధన వ్యయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆర్థికాభివృద్ధిలోనూ ఆర్థిక వనరులు నాశనం చేశారని మండిపడ్డారు. తెచ్చిన అప్పులన్నీ ఏం చేశారో తెలియని పరిస్థితి ఉందన్నారు. 2022-23లో 67 వేల కోట్లు అప్పులు తెచ్చారని, కానీ ఆ రుణంలో కనీస స్థాయిలోకూడా అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చు చేయలేదని విమర్శించారు.
వచ్చిన డబ్బులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దుబారా మాత్రమే చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆదాయం కూడా 17.1 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గిపోయిందని, అప్పులు 16.5 శాతం మేర పెరిగాయని చెప్పారు. వడ్డీలు కట్టే మొత్తం కూడా 15 శాతం మేర పెరిగాయన్నారు. ఇవి కాకుండా వైఎస్సార్సీపీ హయాంలో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా పెద్ద మొత్తంలో జరిగాయని తెలిపారు. ఎక్కువ వడ్డీకి అప్పులు తేవడం, మూలధన వ్యయం లేకపోవడం, పన్నులు పెంచడం లాంటి వివిధ అంశాల కారణంగా ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2022-23లో కేవలం 7,244 కోట్లు మాత్రమే మూలధన వ్యయం చేశారని, జీఎస్డీపీలో ఇది కేవలం 0.5 శాతం మాత్రమే అని వివరించారు. ఒక్క జలవనరుల ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. 2014-19తో పోలిస్తే గత ఐదేళ్లలో మూలధన వ్యయం 60 శాతం మేర తగ్గిపోయిందన్నారు. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్‌లో ఏపీ 18వ ర్యాంకులో ఉందన్నారు.
CM CBN on State Fiscal Health Index: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక పరిస్థితిపై నీతి అయోగ్ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదికపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. తొలిసారిగా నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. నాయకుల అసమర్ధత కారణంగా ప్రజలకు, రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతాయని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందని పేర్కొన్నారు.
Chandrababu on Growth Rate: గత ఐదేళ్లలో వృద్ధి రేటు లేకపోవడం వల్ల ఏటా 76 వేల కోట్ల ఆదాయం కోల్పోవడం సహా రాష్ట్రం దాదాపు 7 లక్షల కోట్ల మేర నష్టపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అందుకే రాష్ట్రానికి వృద్ధి రేటు అనేది చాలా ముఖ్యమని పదేపదే తమ ప్రభుత్వం ప్రస్తావిస్తుందన్నారు. తలసరి ఆదాయంలో కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. ప్రజల కొనుగోలు స్థితి కూడా తగ్గిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక సామాజిక విద్వంసంపై 7 శ్వేతపత్రాలు కూడా విడుదల చేశామన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా 15 శాతం వృద్ధిరేటు కోసం ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు.
తద్వారా 2047 నాటికి తలసరి ఆదాయం 58,14,916కు చేరుతుందని చెప్పారు. సూపర్ సిక్స్‌లో ఎన్టీఆర్ భరోసాలో భాగంగా 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని, దీపం 2.0 పథకంలో ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, ఇసుక, మద్యం, క్లీన్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ లాంటి కొత్త విధానాలు తీసుకువచ్చామని వెల్లడించారు. 8,258 కోట్ల మేర బిల్లులు క్లియర్ చేశామని చెప్పారు. 9015 కోట్ల మేర కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చి 76 పథకాలు రివైవ్ చేశామని వివరించారు.
ఫైనాన్స్ కమిషన్ నిధులు 1400 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. ఇప్పటి వరకూ 6,33,568 కోట్ల రూపాయలు మేర పెట్టుబడులు వస్తున్నాయని తద్వారా 4.10 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. గత ఐదేళ్లలో తాము ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగి, రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. తాము గతంలో చెప్పిందే ఇప్పుడు నీతి ఆయోగ్ ధ్రువీకరించిందన్నారు. నష్ట పోయిన రాష్ట్రానికి వెంటిలేటర్ తీసినా ఇంకా గాడిన పడలేదన్నారు. వృద్ధిరేటు సాధిస్తే ఆదాయం పెరుగుతుంది, అప్పులు తగ్గించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పారు.
తలసరి అప్పు పెరిగింది: గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చారని, అందుకే డెబిట్ రీ షెడ్యూల్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. ఆర్థిక రంగంలో సుస్థిరత వస్తేనే రాష్ట్రం గాడిన పడుతుందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో తలసరి ఆదాయం పెరగలేదు కానీ తలసరి అప్పు పెరిగిందని విమర్శించారు. గాడిన పెట్టడానికి కొంచెం ఆలస్యం అవుతోందని, ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. గత ఐదేళ్ల పాలన వల్ల ఈ ఏడాది ఆదాయం కూడా రాకుండా పోతున్న పరిస్థితి ఉందన్నారు. చెప్పిన అన్ని హామీలు నిలబెట్టుకోవడంతో పాటు మెరుగైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు.
CM On Rescheduled Debt: డెబిట్ రీ షెడ్యూల్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కనీసం 2 వేల కోట్ల మేర భారం తగ్గే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అప్పులు తీర్చలేకపోతే రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్‌లో పెడతారన్నారు. తద్వారా ఏపీకి అప్పు పుట్టే పరిస్థితి ఉండదని వెల్లడించారు. ఇష్టానుసారంగా అప్పులు చేసి నిధులు దుర్వినియోగం చేశారని, అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. 2019 వరకూ తలసరి అప్పు 74,790 అయితే, 2024లో 1.44 లక్షలకి పెరిగిందన్నారు.
జగన్ పాలనలో ఆర్థికం అస్తవ్యస్తం - 2022-23 నాటి పరిస్థితులపై నీతి ఆయోగ్ విశ్లేషణ
జగన్ జమానాకు తార్కాణం - 'రుణ సామర్థ్యం’అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు సున్నా మార్కులు