Dangerous chemicals in fast food : ఫాస్ట్ ఫుడ్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. పానీ పూరి, కట్లెట్, గోబీ మంచూరియా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, గ్రిల్ చికెన్, కబాబ్ సేల్స్ గణనీయంగా పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే, తరచూ ఫాస్ట్‌ఫుడ్స్ తినే వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్లో రుచి కోసం కలుపుతున్న పదార్థాల వల్ల మహిళల్లో పునరుత్పాదకత శక్తి తగ్గుతున్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రాణాంతక రసాయనాలు
‘పానీపూరి, గోల్‌గప్పా, గప్‌చుప్ అని ప్రాంతాల వారీగా వేర్వేరు పేర్లతో పిలుచుకునే ఈ పదార్థం పిల్లలతో పాటు పెద్దలకు ఎంతో ఇష్టం. పల్లెలు, పట్టణాల్లో రోడ్ల వెంట విక్రయించే వీటి కోసం పలు ప్రాంతాల్లో ఎగబడుతుంటారు. అయితే, రుచి కోసం వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. అనారోగ్యాన్ని కలిగిస్తాయని తెలిసినా ఆదాయం కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఆకర్షించే రంగు, రుచి అందించడానికి అందులో వారేం కలుపుతున్నారో తెలిసి ఆరోగ్య శాఖ అధికారులు షాకయ్యారు. పొరుగు రాష్ట్రాలైనా కర్ణాటక, తమిళనాడులో వాటిపై నిషేధం విధించేలా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇంతకీ పానీపూరితో వచ్చే ముప్పేంటో తెలిస్తే మళ్లీ వాటి జోలికెళ్లరు.
అమ్మో! 'స్ట్రాంగ్ టీ' అంత పని చేస్తుందా? - చాయ్ ప్రియులూ పారా హుషార్!
వైఎస్సార్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలకు సరిహద్దు ప్రాంతాలైన కర్ణాటక, తమిళనాడులోని పలు పట్టణాల్లో అక్కడి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలోని తినుబండారాల నమూనాలను సేకరించి వాటిని ప్రయోగశాలలకు పంపగా వాటిలో అజినమోటోతో పాటు క్యాన్సర్లు కలిగించే రసాయనాలు అధికమోతాదులో ఉన్నట్టు గుర్తించారు. అజినమోటో (monosodium glutamate) మోతాదుకు మించి వాడడం వల్ల వచ్చే దుష్పరిణామాలను మయో క్లినిక్ జర్నల్ ప్రచురించింది. అలాంటి రసాయనాల వల్ల మహిళల్లో పునరుత్పాదకత శక్తి తగ్గుతున్నట్లు తెలిపారు. ఆయా తినుబండారాల అమ్మకాలపై కర్ణాటకలో ఆంక్షలు విధించగా మన దగ్గర విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రంగు, రుచి కోసం ఇష్టారాజ్యంగా రసాయనాలు కలిపేస్తున్నారు.
పానీ పూరి నీళ్లలో బ్యాక్టీరియా కారకాలు
గోల్గప్పాలో నింపే నీటిలో ఈ-కొలి, క్లెబ్సిఎల్లా, సుడోమోనాస్, కాండిడస్, ఎంటిరోకోకై వంటి బ్యాక్టీరియాలు ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది.
ఒక్కసారి వేడి చేసిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతుండడం, టేస్టింగ్ సాల్ట్ వినియోగం వల్ల టైపాయిడ్ వంటి జ్వరాలతో పాటు కిడ్నీలు పాడవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పదార్థాలు ఆకర్షణీయంగా ఉండేందుకు రంగు, రుచి కోసం హానికారక రసాయనాలు వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జబ్బులకు మూలం : పానీపూరి, గోబీ, నూడిల్స్, గోబీరైస్‌లో వేసే రంగుల వల్ల ఆస్తమా, అలర్జీలు, దద్దుర్లు వస్తున్నాయట. గుండె, కిడ్నీ జబ్బులు, రోగ నిరోధక శక్తి తగ్గుముఖం పడుతోందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
పర్యవేక్షణ శూన్యం
కడప జిల్లా కేంద్రంలో ఆహార పదార్థాల తనిఖీ, నియంత్రణ విభాగం అధికారులు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను కనీసం తనిఖీ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నమూనాలను సేకరించడం, వాటిని తెలంగాణలోని ల్యాబుకు పంపడం, తిరిగి ప్రయోగశాల నుంచి నివేదికలు తీసుకురావడం వ్యయ, ప్రయాసతో కూడుకున్న వ్యవహారమని మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. నగరపాలక సంస్థ నుంచి ఇలాంటి విక్రయకేంద్రాలను పరిశీలించే అవకాశం ఉన్నా వారు అటువైపు చూడడం లేదని, ఇప్పటికైనా మేలుకోకుంటే ప్రజల ఆరోగ్యానికి ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిపై జిల్లా ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ షంషీర్ మాట్లాడుతూ ఫాస్ట్‌ఫుడ్స్‌లో అజినమోటో, కృత్రిమరంగులను కలుపుతున్నారని, వీటి మోతాదు మించితే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందన్నారు. చైనీస్ వంటకాల విక్రేతలకు, వినియోగదారులకు తరచూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, మరోవైపు తనిఖీలు కొనసాగిస్తామని వెల్లడించారు.
మైగ్రేన్ వేధిస్తోందా? ఎసిడిటీ బాధిస్తోందా? - ఈ వాటర్ ట్రై చేసి చూడండి!
ఈ నూనెతో మొటిమలకు చెక్? - ముఖం సున్నితమై స్కార్ఫ్ కట్టుకోవాల్సిందేనట!