TDP leaders petition to SP: లోకేశ్ పాదయాత్ర అనుమతిపై పోలీసులు స్పందించడం లేదు: అమర్‌నాథ్‌రెడ్డి - TDP leaders gave petition to SP
🎬 Watch Now: Feature Video
TDP leaders petition to SP: వైఎస్సార్ జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రకు ఇంతవరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆ పార్టీ జిల్లా నేతలు తెలిపారు. ఈ మేరకు కడపలో ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి లిఖితపూర్వకంగా విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. జమ్మలమడుగు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని నేతలు కోరారు. జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించినప్పటి నుంచి అనుమతి కావాలని పోలీసులను కోరుతున్నా.. ఇంతవరకు స్పందించలేదని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. వై కేటగిరిలో ఉన్న లోకేశ్‌కు భద్రత మరింత పెంచే విధంగా పోలీస్ బందోబస్తు పటిష్టం చేయాలని ఎస్పీని కోరినట్లు వివరించారు. ఇంతవరకు జిల్లాలో పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంలో వారి ఉద్దేశమేంటో తమకు అర్థం కావడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు లిఖితపూర్వకంగా మరోసారి విజ్ఞాపన అందజేయడంతో మధ్యాహ్నం లోపు అనుమతిస్తామని ఎస్పీ చెప్పినట్లు టీడీపీ నేతలు మీడియాకు వెల్లడించారు. జిల్లా ఎస్పీని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పొలిటి బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు కలిశారు.