దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతుంది : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - Nellore District News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 5:08 PM IST
TDP Leader Somireddy Chandramohan Reddy Deeksha Bhagnam : అర్ధరాత్రి పోలీసులు తన దీక్షను భగ్నం చేయడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నెల్లూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. లీజు లేకుండా, పన్ను కట్టకుండా మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. శాంతియుతంగా చేస్తున్న దీక్షను పోలీసులు ఎలా భగ్నం చేస్తారని సోమిరెడ్డి ప్రశ్నించారు. దేశంలోనే అతిపెద్ద భారీ స్కామ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతోందని తెలిపారు. కనీసం నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని మండిపడ్డారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి అక్రమ అరెస్ట్‌పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సోమిరెడ్డిని అరెస్ట్ చేసిన విధానం చూస్తే పోలీసులా? లేక రౌడీలా? అనే అనుమానం కలిగిందని తెలిపారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన పోలీసులను వదిలి పెట్టమన్నారు. ఈ ఘటన సోమిరెడ్డి మరిచిపోయినా తను మరిచి పోనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు గెలుచుకొని టీడీపీ, జనసేన పార్టీ అధికారంలోకి రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.