Summer storage tank is weakening: నాలుగున్నరేళ్లుగా మరమ్మతులకు నోచుకోని సమ్మర్ స్టోరేజీ ట్యాంక్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2023, 1:34 PM IST
Summer Storage tank is Weakening due to Negligence of Authorities: నెల్లూరుకు తాగునీరందించే సమ్మర్ స్టోరేజీ ట్యాంకు అధికారుల నిర్లక్ష్యానికి గురౌతోంది. నగర వాసులకు రక్షిత తాగునీటిని అందించేందుకు 2011లో 200ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువును నిర్మించారు. పెన్నా నది నీటిని చెరువులో నింపి, శుద్ధి చేసి తాగునీటిని సరఫరా చేస్తారు. గత నాలుగున్నరేళ్లుగా నిధుల లేక సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు మరమ్మతులు చేసేవారు లేక కట్ట బలహీన పడుతోంది. నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం పొదలకూరు రోడ్డు వైపు కాలనీలు. ఈ ప్రాంతంలో 2లక్షల మంది జనాభా ఏడు డివిజన్లలో నివాసం ఉంటున్నారు. వీరికి రక్షిత నీటిని అందించే ట్యాంక్ బండ్ బలహీనపడింది. 8వేల మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు 2011లో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం స్టోరేజీ ట్యాంకు చుట్టూ ఉన్న కట్ట బలహీనపడింది. 8కిలోమీటర్ల పరిధిలో ఉన్న మట్టి కట్ట పగుళ్లు ఇచ్చింది. కట్టపైన చెట్లు భారీగా పెరిగి వేర్లు లోపలికి చొచ్చుకుపోయి రివిట్‌మెంట్లు బలహీనపడ్డాయి. కట్ట పరిస్థితి బలహీనంగా ఉన్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మీద ఆధారపడి చంద్రబాబునగర్, బుజబుజ నెల్లూరు, అక్కచెరువుపాడు, కొత్తూరు, శ్రీలంకకాలనీ, రామకోటయ్యనగర్, అంబాపురం వంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. తాగునీరు అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బండ్ బలహీన పడిందని, అధికారులు నిధులు కేటాయించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని మొదలు పెట్టలేదని ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. విషయాన్ని కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కట్టను పరిశీలించి అవసరమైన చోట మరమ్మతులు చేస్తామన్నారు. కార్పొరేషన్ అధికారులు, పాలకులు సమ్మర్ స్టోరేజి ట్యాంక్ ను పట్టిష్టంగా మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.