TDP Government Action on Illegal structures in Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన మొదలైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి ఆ దిశగా చర్యలు చేపట్టింది. సామాన్య భక్తులకు భద్రత, స్వామివారి నిధులకు భరోసా కల్పించడంతో పాటు అక్రమ కట్టడాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది.
వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంతో పాటు పవిత్రమైన తిరుమల వెంకన్న క్షేత్రం భ్రష్టుపట్టడంతో కొత్త పాలకమండలి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే సామాన్య భక్తులను క్యూలైన్లలో ఇబ్బందులకు గురి చేశారన్న విమర్శలు గత టీటీడీ ధర్మకర్తల మండలిపై వెల్లువెత్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్టు నిధులను తప్పుదారి పట్టించారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటైన కొత్త ధర్మకర్తల మండలి తన తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
భక్తులకు భరోసా కల్పించడమే కాకుండా స్వామివారి ఆస్తులను పరిరక్షించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల ద్వారా వచ్చే నిధులను నేరుగా టీటీడీ ఖాతాలోనే జమ అయ్యేట్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న స్వామివారి నగదు, బంగారు డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలని నిర్ణయించారు. వివిధ టూరిజం కార్పొరేషన్ ద్వారా కేటాయించే దర్శన టిక్కెట్లలో అక్రమాలు జరుగుతున్నాయన్న అభియోగాలు రావడంతో వాటిని పూర్తిగా రద్దు చేశారు. గతంలో తిరుపతిలోని స్థానికులకు ఇచ్చే శ్రీవారి దర్శన కోటాను మళ్లీ ప్రారంభించింది. టీటీడీ పాలక మండలి నిర్ణయాన్ని స్వాగతిస్తూ తిరుపతిలోని నాలుగుకాళ్ల మండపం వద్ద సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు జనసేన నాయకులు పాలాభిషేం చేశారు.
దళారులపై నిఘా- టికెట్లు, గదుల విషయంలో వారి జోక్యం కుదరదు
నిబంధనలు పాటించకుండా అక్రమ నిర్మాణాలకు పాల్పడిన విశాఖ శారద పీఠం స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేలా ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. తిరుపతి జూపార్క్ రోడ్డులోని టూరిజం శాఖకు ఇచ్చిన దేవలోక్ ప్రాజెక్టును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలు తిరుమల పవిత్రత పునరుద్ధరణకు దోహదం చేస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.