మహిళ ఆత్మహత్యాయత్నం.. CPR చేసిన పోలీసులు.. లక్కీగా.. - మహిళకు సీపీఆర్ చేసిన పోలీసులు
🎬 Watch Now: Feature Video
తమిళనాడులో కుటుంబకలహాలతో ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను పోలీసులు సీపీఆర్ చేసి కాపాడారు. అనంతరం ఆమెను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులకు స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం చెన్నైలో జరిగిందీ ఘటన. పాత పల్లవరంలోని శుభంనగర్ ప్రాంతంలో తమిళసెల్వి(53) అనే మహిళ తన భర్త శ్రీనివాసన్‌తో కలిసి నివసిస్తోంది. అయితే తమిళసెల్వి కుటుంబకలహాల కారణంగా ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ గోపాల్, హెడ్ కానిస్టేబుల్ రమేశ్, షేక్ మహ్మద్, రమేశ్ అనే మరో కానిస్టేబుల్లు కేవలం 7 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే లోపల నుంచి తాళం వేసి ఉన్న గది తలుపులు పగలగొట్టి.. ఉరివేసుకున్న తమిళసెల్విని కిందకు దించారు. అయితే ఆమె అప్పటికే ఊపిరాడక స్పృహ కోల్పోయింది. అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ వెంటనే సీపీఆర్ అందించి తమిళసెల్వి ప్రాణాలను కాపాడారు. ఇది చూసిన ఆమె కుటుంబసభ్యులు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు వెంటనే తమిళసెల్విని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రి తరలించారు.