వైసీపీ ఎంపీ అనుచరుడి బెదిరింపులు - ఆత్మహత్య చేసుకుంటామంటున్న మైనార్టీ కుటుంబం - రేపల్లె సన్నీ పై పోలీసులకు ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 7:07 PM IST
Complaint to SP on YCP leader Repalle Sunny: వైసీపీ నేతలు అక్రమ ఇసుక తరలింపే కాదు, ఇసుక వ్యాపారం పేరుతో సైతం అక్రమాలకు పాల్పడుతున్నారు. తనకు ఇసుక రీచ్ కాంట్రాక్ట్ వచ్చిందని, అవసరానికి డబ్బులు తీసుకొని, గత నాలుగు సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడో వైసీపీ నేత. తన వద్ద ఇసుక కాంట్రాక్ట్ పేరుతో డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదంటూ బాధితుడు ఎస్పీని ఆశ్రయించిన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు రేపల్లె సన్నీ తమని మోసం చేశారని గుంటూరుకు చెందిన ఓ కుటుంబం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. రేపల్లె సన్నీ ఇసుక రీచ్ కాంట్రాక్ట్ వచ్చిందని నమ్మబలికి 25లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని బాధితుడు ముజిబుర్ రహ్మాన్ తెలిపారు. డబ్బుల కోసం రెండేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని రహ్మాన్ వాపోయారు. ఈ విషయంలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేశారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంపీ నందిగం సురేష్ ను మూడు సార్లు కలిస్తే, డబ్బులతో తనకు సంబంధం లేదన్నారని తెలిపారు. ఇంకోసారి వస్తే జైళ్లో పెట్టిస్తానని బెదిరించినట్లు ఆరోపించారు. తెలిసిన వ్యక్తి కావటంతో రేపల్లె సన్నీకి ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చామని బాధితుడి తల్లి నజిమున్నీసా వాపోయారు. ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే సీఎం ఆఫీస్ ముందు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.