Telugu Wikipedia Festival 2025 : గ్రామాలు, ప్రముఖ వ్యక్తులు, చారిత్రక కట్టడాలు ప్రదేశాలు ఇలా ఏ సమాచారం కావాలన్నా వెంటనే గుర్తుకొచ్చేది వికీపీడియానే. ఇది తెలుగులోనూ విజ్ఞానాన్ని అందిస్తోంది. మొబైల్ యాప్‌లోనూ సమాచారం తెలుసుకునే వీలుంది. ఈ క్రమంలోనే తెలుగు వికీపీడియా పండగ 2025ను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 50 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.

2003లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా ఇప్పటివరకు లక్షకు పైగా వ్యాసాలను కలిగి ఉంది. ఈ సందర్భంగా వికీపీడియాను విస్తరించే మార్గాలు, సభ్యుల వ్యాస రచనా నైపుణ్యాల మెరుగుదల, వ్యాసాలను ప్రజలకు మరింత ఆసక్తికరంగా రూపొందించే పద్ధతులు, తదితర కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. అనంతరం తెలుగు వికీపీడియాలో చేరండి - అందరికీ విజ్ఞానం పంచండి అనే నినాదంతో తిరుపతి వీధుల్లో సభ్యులు ర్యాలీ నిర్వహించారు. కరపత్రాలను పంచి ప్రజలకు దీనిపై అవగాహన కల్పించారు.

తెలుగు వికీపీడియా బడి పేరుతో త్వరలో ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు కోఆర్డినేటర్ కృపాల్ కశ్యప్ వెల్లడించారు. కొత్త సభ్యులు వీటి ద్వారా ఇందులో భాగస్వాములు కావొచ్చని అన్నారు. ఈ సందర్భంగా గత దశాబ్ద కాలంలో తెలుగు వికీపీడియాకు విశేష సేవలు అందించిన వారిని ఈ వేడుకల్లో సత్కరించారు. ఉత్తమ నిర్వాహకునిగా యర్రా రామారావు ఎంపికయ్యారు. అదేవిధంగా చదువరి ఎన్ఆర్. గుళ్లపల్లి, శ్రీరామమూర్తి, బత్తిని వినయ్‌కుమార్ గౌడ్, స్వరలాసిక, టి.సుజాత, రవిచంద్ర, రామేశం, ఐ.మహేశ్, బీకే విశ్వనాథ్ తదితరులను పురస్కారాలతో సత్కరించారు.
వికీపీడియాలో ఇండియన్ పేజీల హవా! సినిమాలు, క్రికెట్‌పై ఇంట్రెస్ట్- ఎక్కువ వ్యూస్ మాత్రం దానికే!