Uppalapadu Bird Sanctuary Problems in Guntur District: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉప్పలపాడు విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రం ప్రసిద్ధి చెందింది. ఖండాంతరాలు దాటి, వేల కిలోమీటర్లు విహరించి, నెలల తరబడి ప్రయాణించి, అనేక రకాల పక్షులు ఈ ప్రదేశానికి వస్తుంటాయి. 18 దేశాల నుంచి వచ్చే దాదాపు 30 రకాల అరుదైన పక్షులతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా, సందడిగా ఉంటుంది. కానీ గత ఐదేళ్ల కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పక్షుల విడిది కేంద్రంపై ఎలాంటి శ్రద్ధ పెట్టకపోవడంతో పక్షులు ఉండేందుకు ఆవాసం సరిపోక ఇబ్బందులు పడుతున్నాయి.
విదేశీ పక్షుల రాక: గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రానికి సుమారు 18 దేశాల నుంచి ఏటా వేలాది పక్షులు వస్తుంటాయి. ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రానికి ఆస్ట్రేలియా, సైబీరియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్ వంటి దేశాలతో పాటు హిమాలయాల నుంచి కూడా వేలాది పక్షులు ఆయా కాలాల్లో వలస వస్తోంటాయి. అందుకే ఉప్పలపాడు పక్షుల కేంద్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం సందర్శకులు వివిధ రకాల పక్షుల్ని చూసేందుకు తరలివస్తుంటారు. కానీ ఇదంతా గతంగా మారింది. వైఎస్సార్సీపీ పాలనలో ఈ పక్షుల కేంద్రాన్ని గాలికొదిలేయడంతో సందర్శకుల తాకిడి బాగా తగ్గిపోయింది.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం: ఉప్పలపాడు చెరువు మధ్యలో లంకల మాదిరి మట్టి దిబ్బలు ఉన్నాయి. ఈ మట్టి దిబ్బలపై తుమ్మ చెట్లు ఏపుగా పెరిగి పక్షుల ఆవాసానికి అనుకూలంగా ఉండటంతో వేలాది పక్షులు వాటిని ఆవాసాలుగా మార్చుకున్నాయి. సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ ఎక్కువ కాలం ఇక్కడే ఉంటున్నాయి. ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం అటవీశాఖ వన్యప్రాణి విభాగం పరిధిలో ఉంది. గత ప్రభుత్వం, అటవీ అధికారులు పర్యవేక్షణపై శ్రద్ధ పెట్టకపోవడంతో తుమ్మచెట్లు అన్నీ ఎండిపోయాయని, దీంతో పక్షులు మోడు వారిన ఈ చెట్లపై ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నాయని పర్యాటకులు చెబుతున్నారు.
కాలానుగుణంగా పక్షుల సందడి: దాదాపు 30 రకాల విదేశీ పక్షులు ఉప్పలపాడు సంరక్షణ కేంద్రానికి కాలానుగుణంగా వస్తుంటాయి. వేసవిలో ఆస్ట్రేలియా నుంచి, శీతాకాలంలో సైబీరియా, చైనా నుంచి, ఆగస్టులో దక్షిణాఫ్రికా నుంచి పక్షులు వస్తుంటాయి. పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్, ఓపెన్ బీల్ స్టార్క్స్, వైట్ ఐబిస్, డార్టర్ స్నేక్ పక్షులు ఏడాది పొడవునా దర్శనమిస్తాయి. వలస పక్షులతోపాటు పలు స్థానిక జాతులకు చెందిన పక్షులు కూడా ఈ ప్రాంతంలో దర్శనమిస్తాయి. అయితే అరుదుగా కనిపించే వలస పక్షులను చూడడానికి పర్యాటకులు వస్తున్నప్పటికీ... అందుకు అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో క్రమంగా ఆదరణ తగ్గిపోతోంది. చిన్నారులు ఆడుకునేందుకు క్రీడా సామగ్రి, పార్కు లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు...BITES..
పక్షులకు ఆవాసాలు కల్పించాలని స్థానికుల విజ్ఞప్తి: విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఇక్కడికి తరలిరావడానికి ముఖ్యంగా ఉప్పలపాడులో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులే కారణంగా తెలుస్తోంది. చైనా, రష్యా, సైబీరియాల్లో భారీగా మంచు కురిసే సమయాల్లో పక్షులకు ఆహారం దొరకదు. వాటి జీవనం సైతం దుర్భలంగా మారుతుంది. అందుకే ప్రధానంగా ఆహారం కోసం, వాతావరణ ప్రతికూలతల నుంచి కాపాడుకునేందుకు, సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పలపాడు కేంద్రానికి వలస వస్తున్నాయి. సరైన నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ కూడా ఈ వలస జీవులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. విదేశీ పక్షులు కేవలం చేపలను ఆహారంగా తీసుకుంటాయి. అందుకు అనుగుణంగా వాటి ఆహారానికి సరిపడే చేపలను చెరువులో పెంచాలని, వాటి నివాసానికి సరిపడేలా ఇనుప ఆకృతులు ఏర్పాటు చేయాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.
''ఎన్నో రకాల విదేశీ పక్షులను ఇక్కడ మాత్రమే చూడగలం. వేరే ప్రాంతాల నుంచి వచ్చే వారు మీ ప్రాంతంలో ఎన్నో రకాల పక్షులు వస్తూ ఉంటాయి కదా అని అంటూ ఉంటారు. అంతే కాకుండా ఈ పక్షుల కేంద్రంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి మౌలిక సౌకర్యాలు కల్పిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం''-సందర్శకులు
గుంటూరు జిల్లా ఉప్పలపాడులో విదేశీ పక్షుల సందడి
సందడి చేస్తున్న విదేశీ పక్షులు - యూరప్ నుంచి ప్రకాశం జిల్లాకు
మార్కాపురానికి అనుకోని అతిథులు - సెల్ఫోన్లో బంధించిన ప్రజలు - Beautiful Birds in Markapuram Pond