Villagers Cleaning Drainage: పట్టించుకోని అధికారులు.. పారిశుద్ధ్య కార్మికులుగా మారిన ప్రజలు - ఏపీ వార్తలు
🎬 Watch Now: Feature Video
Palthur Villagers Cleaning Drainage : డ్రైనేజీలను శుభ్రం చేయాలని సచివాలయ సిబ్బందికి పలుమార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతో గ్రామస్థులే స్వయంగా రంగంలోకి దిగి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో ప్రజలే పారిశుద్ధ్య కార్మికులుగా మారారు. పంచాయతీ అధికారులు మురికి కాలువలను శుభ్రం చేయించకపోవడంతో రోగాల బారిన పడిన గ్రామస్థులు.. స్వచ్ఛంద పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది ఎవరు కూడా డ్రైనేజీ సమస్య పట్టించుకోకపోవడంతో గురువారం పాల్తూరు గ్రామంలోని బీసీ కాలనీ ప్రజలు వచ్చి డ్రైనేజీ కాలువుల్లోకి దిగి మురుగును రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. పలుమార్లు సచివాలయం వద్దకు వెళ్లి వినతిపత్రం అందించిన కూడా స్పందించకపోవడంతో తామే ఇంకా ఈ పని చేసినట్లు వారు తెలిపారు. పంచాయతీ రోడ్డుపై మురుగు వ్యర్థం వేయడంతో ఉరవకొండ నుండి పాల్తూరు, హవళిగి, బళ్లారి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి తాము పని చేస్తున్న కూడా గ్రామ సర్పంచ్ గానీ, సచివాలయ అధికారులు గానీ ఎవరూ రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీ ద్వారా మురుగును తరలించారు.