Yuvagalam Padayatra: లోకేశ్ పాదయాత్రలో మరో మైలురాయి.. 1300 కిలోమీటర్లు పూర్తి
🎬 Watch Now: Feature Video
Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది. నంద్యాల నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రలో లోకేశ్ 1300 కిలోమీటర్లు పూర్తి చేశారు. నంద్యాల శివారు యాతం ఫంక్షన్ హాల్ నుంచి 103వ రోజు పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. అక్కడే యాత్ర 13 వందల కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల మండలం కానాల, గోస్పాడు మండలం చింతకుంట, గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది.
తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. నంద్యాల రూరల్ మండలం కానాల పంచాయతీలో.. పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. నంద్యాలలో రైతులతో ముఖాముఖి నిర్వహించిన లోకేశ్.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు తగ్గించి.. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అలాగే గండ్రేవుల సహా రాయలసీమలోని పెండింగు ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.