Teacher Beats up Students while Drunk: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
టాయిలెట్‌లో మద్యం సీసాలు: జిల్లాలోని హొళగుంద మండలం ముద్దటమాగి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 160 మంది విద్యార్థులకు జయరాజు ఏకోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పాఠశాల టాయిలెట్‌లో మద్యం సీసాలను గుర్తించిన విద్యార్థులు ఉపాధ్యాయుడికి సమాచారం అందించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉపాధ్యాయుడు జయరాజు ప్లాస్టిక్ పైపుతో విద్యార్థులను చితకబాదారు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఎంఈవో జగన్నాథం పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుడు నిత్యం మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారని విద్యార్థులు ఎంఈవో వద్ద వాపోయారు.
క్రమశిక్షణ చర్యలకు ఆదేశం: ఈ ఘటనపై స్పందించిన మంత్రి లోకేశ్ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదారన్న వార్త తనను తీవ్ర విస్మయానికి గురి చేసిందని మంత్రి అన్నారు. సంబంధిత ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత స్థానంలో ఉండే గురువులు సమాజంలో ఆదర్శంగా ఉండాలి తప్ప ఇటువంటి చర్యలు వారి గౌరవాన్ని తగ్గిస్తాయని చెప్పారు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ చర్యలు తీసుకోవాలని ఆదేశించగా కర్నూలు డీఈవో శ్యామ్యూల్ పాల్ ఉపాధ్యాయుడు జయరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎక్కడున్నారో? ఏమైపోయారో? - మతిపోగొడుతున్న మిస్సింగ్ కేసులు
ఆరోజు చూసిన కన్నీటి గాథలు, ఇచ్చిన హామీలు నేటీకీ గుర్తున్నాయి: నారా లోకేశ్