Satya Sai Samiti Women Members In Chittoor City: పేదలకు అందించే సాయం పరమాత్ముడికి సేవ చేయడంతో సమానమనే స్ఫూర్తితో సత్యసాయి సమితి మహిళా సభ్యులు తమ సేవానిరతిని చాటుతున్నారు. చిత్తూరు నగరానికి చెందిన ఈ మహిళలు కొన్నేళ్లుగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తద్వారా పది మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆహారం లేక నానా అవస్థలు పడుతున్న అభాగ్యులు నేడు ఎందరో ఉన్నారు. వీరికి నెలలో ఒక్కపూటైనా ఆహారం అందించాలన్న ఆలోచన మహిళా సభ్యుల హృదయాల్ని కదిలించింది.
నిత్యం అన్నదానం చేయాలనే ఆశయం: ఆకలితో ఎవరూ అలమటించకూడదనే సదుద్దేశంతో తమ ఇంట ప్రతిరోజూ పిడికెడు బియ్యాన్ని అన్నదానానికి కేటాయిస్తున్నారు. సభ్యులందరూ సేకరించిన బియ్యంతో వారే స్వయంగా సిద్ధం చేసిన ఆహారాన్ని దీనులకు అందజేస్తున్నారు. వారానికోసారి వందమందికి చొప్పున నెలలో నాలుగుసార్లు దీనులకు అన్నదానం చేస్తున్నారు.
మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ సేవల్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో నిత్యం అన్నదానం చేయాలనే ఆశయంతో ప్రయత్నిస్తున్నామని మహిళలు అంటున్నారు. ప్రతినెలా 19న సత్యసాయి సమితి మాస మహిళా దినోత్సవంగా నిర్దేశించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, చంటి బిడ్డలకు దుస్తులు, ఆహారం అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
"నేను ఎంకాం చదివా. పెళ్లయిన తర్వాత పిల్లల కోసం గృహిణిగా ఉండిపోయా. సమాజానికి సేవ చేయాలనే ఆలోచన రాగానే సహచర సభ్యులతో చర్చించాను. అప్పుడు అందరం సమష్టిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం". -రుక్మిణి, చిత్తూరు
"అభాగ్యులకు ఒక్కపూటైనా భోజనం అందజేయాలన్న ఆలోచనతో గుప్పెడు బియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సభ్యులందరూ సహకరిస్తుండటంతో నిరాటంకంగా కొనసాగిస్తున్నాం". -కల్పన, చిత్తూరు
"మొదట్లో తక్కువమంది సభ్యులతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ సేవ చేయడం మాకు సంతృప్తినిచ్చింది. ఇప్పుడు మాతో పాటు చాలామంది సేవ చేయడానికి చేతులు కలుపుతున్నారు". -వాసవి, చిత్తూరు
శభాష్ - అభాగ్యులకు ఆత్మ బంధువు 'మన ఇల్లు'