shocking incident in Kadiri: మనుషుల కన్నా పశువులే నయం..! - రోడ్డుపై పశువు మృతి
🎬 Watch Now: Feature Video
Shocking incident in Kadiri: చంద్రుడిపై అడుగు పెట్టేశాం.. అంగారకుడినీ చుట్టేశాం.. అంతరిక్షాన్నీ అవపోసనా పడుతున్నాం. కానీ, మన పక్కనే ఉండే మనుషులతో సంబంధాలు నెరపలేని దుస్థితిలో ఉన్నాం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలైన నేపథ్యంలో.. మానవత్వం మంటగలిసి పోతున్న నేటి తరుణంలో.. మనుషుల కన్నా పశువులే నయం అనిపిస్తోంది.. దీనిని రుజువు చేసేలా.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఒకేరోజు చోటు చేసుకున్న రెండు ఘటనలు చక్కని ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఓ మనిషీ నీ గమనమెటు.. గమ్యం ఏమిటీ.. అని ప్రశ్నిస్తున్నాయి.
నిన్న.. తెలంగాణలోని సూర్యాపేట పట్టణంలో.. పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడిని నలుగురు చుట్టుముట్టి కత్తులు, రాళ్లతో దాడి చేస్తున్నా.. అడ్డుకునేందుకు అక్కడున్న ఏ ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రయత్నించలేదు. కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ కనిపించారు. చివరికి మూకుమ్మడిగా అడ్డుకున్నా అప్పటికే ఆ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
ఇవాళ.. కదిరి పట్టణంలో ఓ యాచకుడు రోడ్డు పక్కన అచేతన స్థితిలో పడి ఉంటే.. జనం చూస్తూ వెళ్లారే తప్ప ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ప్రాణంతో ఉన్నాడో లేదో అని కనీసం ఆలోచించనూ లేదు. కానీ, అక్కడికి కొద్ది దూరంలోనే ఓ ఎద్దు ప్రమాదవశాత్తు రోడ్డుపై మృతి చెందింది. అచేతనంగా పడి ఉన్న తోటి కోడెను చూసిన మిగతా ఆవులు, ఎద్దులు దాని చుట్టూ చేరాయి. ఏమైందో తెలియని ఆ మూగజీవాలు ఎద్దును లేపేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. కుక్కలను, మనుషులను, వాహనాలను అటువైపు రానీయకుండా రక్షణగా అడ్డు నిలిచాయి. తోటి జీవం, ప్రాణం విలువపై మూగ జీవాల ప్రేమ ఆలోచింప చేసింది.