పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య - రోడ్డు ప్రమాదం కాదు : ఎమ్మెల్సీ సాబ్జీ కుబుంబ సభ్యులు - ఘోర రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 12:23 PM IST
MLC Sheikh Sabji Family Members Suspicious on Accident : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణంపై కుటుంబ సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. సాబ్జీ మృతిపై ఆయన కుమారుడు ఆజాద్, సోదరుడు ఫరీద్ ఖాసీం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తన తండ్రిది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని ఎవరో కుట్రపూరితంగా, పథకం ప్రకారమే చేసి ఉంటారని ఆజాద్ ఆరోపించారు. సాబ్జీ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసి బయటికి తీసుకువచ్చాక ఇంకా రక్తం కారుతోందని, ఆయన ఎమ్మెల్సీ అయినా పోస్టుమార్టం సక్రమంగా చేయలేదని ఆయన తెలిపారు.
రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు : ప్రమాద కారకులు తప్పించుకునేలా పోలీసుల విచారణ ఉన్నట్లు అనుమానంగా ఉంది ఆజాద్ పేర్కొన్నారు. కారు నంబరు చెప్పారే తప్ప ప్రమాద కారకుల వివరాలను వారు వెల్లడించలేదు. డ్రైవర్ పక్కన ఉన్న వారు మాత్రమే చనిపోయేలా, కావాలనే తప్పుడు మార్గంలో వచ్చి ప్రమాదం చేశారనే అనుమానం కలుగుతోందని అన్నారు. తమకు అనుమానాలు ఉన్నాయని చెబుతున్నా పోలీసులు రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే మరో ఫిర్యాదు ఇవ్వాలని చెప్పారని తెలిపారు.
పక్కా ప్రణాళిక ప్రకారమే : తన తమ్ముడికి జరిగింది ప్రమాదం కాదని, ప్లాన్ చేసి కావాలనే చేయించినట్లుగా భావిస్తున్నామని సాబ్జీ సోదరుడు షేక్ ఫరీద్ ఆరోపించారు. వాహనాన్ని ఢీకొట్టిన వారు అక్కడి నుంచి పారిపోయారని కూడా ప్రచారం జరిగింది. తన తమ్ముడిపై కక్ష గట్టారని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని, ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.