చంద్రగిరి నుంచి కుమారుడి అభ్యర్దిత్వాన్ని ఆశీర్వదించండి: ఎమ్మెల్యే చెవిరెడ్డి - ఏపీ ముఖ్యవార్తలు
🎬 Watch Now: Feature Video
ముఖ్యమంత్రి జగనన్న సూచన మేరకు తన కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. తిరుపతి సమీపంలోని శిల్పారామం వేదికగా నిర్వహించిన చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2024 ఎమ్మెల్యే అభ్యర్థిగా జనం ముందుకు వచ్చే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తన తల్లిదండ్రులు జన్మనిస్తే.. చంద్రగిరి ప్రజలు రాజకీయ జీవితాన్ని ఇచ్చారని ఆయన తెలిపారు. చంద్రగిరి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా తనకు గుర్తింపు వచ్చిందంటే అదంతా.. నాయకులు, కార్యకర్తలు పెట్టిన బిక్షేనని అన్నారు. మీ అందరి కళ్ల ముందు పెరిగిన తన బిడ్డ మోహిత్ ను మీ బిడ్డగా దగ్గరకు తీసుకుని ఆదరించాలని కోరారు. జగనన్న దగ్గరుంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా ప్రత్యేక నిధులు మంజూరైనా మొదటగా చంద్రగిరికి తీసుకుని వస్తానన్నారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డిని వేదికపై సన్మానించారు.