కన్నుల పండువగా లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం.. లక్షల్లో పాల్గొన్న భక్తజనం - కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
LAKSHMI NARASIMHA SWAMY RATHOTSAVAM: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పన్నెండవ రోజు స్వామివారు బ్రహ్మరథాన్ని అధిష్టించి భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒక్కోరోజు ఒక్కో వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. వేడుకల్లో అతి ముఖ్యమైన ఈ రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. దక్షిణభారత దేశంలోని అతిపెద్ద రథాల్లో ఒక్కటైన కదిరి నారసింహుడి బ్రహ్మరథాన్ని వేలాది మంది భక్తులు, నారసింహస్వామి నామస్మరిస్తూ భక్తి పారవశ్యంతో లాగుతారు.
ఆగమన శాస్త్ర బద్ధంగా పూజాధి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సోమవారం ఉదయం 7.30 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. స్వామివారి భక్తులతో కదిరి జనసంద్రంగా మారింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా బ్రహ్మదేవుడి రథంపై కంబాలరేడు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మదేవుడే సారథిగా మారి స్వామిని ఊరేగింపునకు తీసుకెళ్తారన్నది జనప్రతీతి. పచ్చని తోరణాలతో వివిధ రకాల పుష్పాలతో రథాన్ని(తేరును) అలంకరించారు.
సంప్రదాయ బద్ధంగా కుటాగుళ్ల, గజ్జలరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల నుంచి వచ్చే స్వామివారి భక్తులు రథాన్ని నియంత్రించేందుకు, ముందుకు సాగేందుకు తెడ్లను వేస్తూ లాగుతుండగా రథం ముందుకు సాగింది. తిరువీధుల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను చేశారు. అక్కడికి భక్తులు లక్షల్లో తరలివచ్చినందున పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.