Venkaiahnaidu: 'పదవీ విరమణ చేశా కానీ.. పెదవి విరమణ చేయలేదు' - నెల్లూరు జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Venkaiah Naidu at Atmakur Spiritual Meeting: ధనాన్ని, కులాన్ని చూసి కాకుండా.. గుణాన్ని చూసి ఓటు వేసి అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలని ప్రజలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని.. చిన్ననాటి మిత్రులు, నియోజకవర్గ ప్రజలతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రాజకీయాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కొంత మంది నాయకులు రాజకీయ లబ్ధి కోసం, వార్తల్లో నిలిచేందుకు చొక్కాలు చించుకుంటున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. తాను పదవీ విరమణ చేశానే తప్ప.. పెదవి విరమణ చేయలేదని అన్నారు. ఆత్మకూరులో టిడ్కో గృహ సముదాయ నిర్మాణానికి వెంకయ్యనాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని అవకాశం కల్పించారంటూ.. ఇళ్ల లబ్ధిదారులు ప్లకార్డులు ప్రదర్శించి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయినా.. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులను మాత్రం కల్పించలేదని ఆయనకు విన్నవించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వెంకయ్యనాయుడు వారికి హామీ ఇచ్చారు.