Smuggling of ration rice "ఎమ్మెల్యే అండతో రేషన్‌బియ్యం దందా!.. అందుకే ఇక్కడి అధికారులెవరూ బదిలీ కారు!" - స్టాక్ పాయింట్
🎬 Watch Now: Feature Video
Smuggling of ration rice : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి, ఆయన బావమరిది అండదండలతో చౌక బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు. నేరుగా స్టాక్ స్టాక్ పాయింట్ నుంచి నెలకు లారీల కొద్దీ బియ్యాన్ని అక్రమ మార్గంలో పొరుగు ప్రాంతాలకు తరలించి కోట్ల రూపాయలు అర్జిస్తున్నారని తెలిపారు. డీలర్లతో సంతకాలు పెట్టించుకుని ప్రతి నెలా నాలుగు లారీల బియ్యం ఇతర ప్రాంతాలకు వెళ్తోందని ఆయన వెల్లడించారు. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ వ్యాపారం జరుగుతోందని, ఇలియాస్ అనే అతను గతంలో బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ పట్టుబడ్డాడని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేరుగా స్టాక్ పాయింట్ నుంచే తరలించడాన్ని తహసీల్దార్ ఎందుకు పట్టించుకోవడం లేదు అని వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నేతలు నిరు పేదల బియ్యాన్ని కూడా అమ్ముకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఆరు నెలలుగా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజలను నిలువునా దోచుకునే పరిస్థితి వైఎస్సార్సీపీ పాలనలో ఉందని ఆరోపించారు. చౌక బియ్యం అక్రమ రవాణా, భూముల వ్యవహారంలో తహసీల్దార్ సైతం ఎమ్మెల్యేకు పూర్తిగా సహకరిస్తున్నారని వరదరాజుల రెడ్డి ఆరోపించారు. అందుకే మూడేళ్లు అవుతున్నా తహసీల్దార్ ప్రొద్దుటూరు నుంచి బదిలీ కాలేదని అన్నారు.