Fact Finding Committee at Polavaram: దెబ్బతిన్న గైడ్ బండ్‌ను పరిశీలించిన నిజనిర్ధరణ కమిటీ - పోలవరం
🎬 Watch Now: Feature Video
Fact Finding Committee Visited Polavaram: ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గైడ్ బండ్ దెబ్బతినడంతో.. కేంద్ర జలశక్తి శాఖ నియమించిన నిజ నిర్ధరణ కమిటీ పోలవరంలో పర్యటించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన బృందం ప్రాజెక్టులో పర్యటించి.. స్పిల్ వే ఎగువన ఎడమవైపున నిర్మించిన గైడ్ బండ్, రిటైనింగ్ వాల్ నిర్మాణాలను పరిశీలించింది. ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న కమిటీ సభ్యులు.. ముందుగా ప్రాజెక్టు వద్దనున్న సమావేశ మందిరంలో భేటీ అయ్యారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి దెబ్బతిన్న నిర్మాణాలను పరిశీలించారు. ఎగువ కాఫర్ డ్యాంలో లీకేజీ పెరిగి.. క్రమేణా నీరు పెరుగుతున్న క్రమంలో.. నిపుణుల బృందం ఈ రెండు అంశాలపై ముఖ్యంగా దృష్టి పెట్టింది. శుక్రవారం రాజమహేంద్రవరంలో ప్రాజెక్టు అధికారులు, ఇంజనీర్లతో ఈ బృందం సమావేశం నిర్వహించి గైడ్ బండ్ దెబ్బతినడం, కాఫర్ డ్యాం లీకేజీలపై లోతుగా చర్చించనుంది.