పేలుతున్న దీపావళి టపాకాయల ధరలు - బెంబేలెత్తుతున్న సామాన్యులు!
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 7:44 PM IST
|Updated : Nov 12, 2023, 6:41 AM IST
Diwali Crackers Price Hike: అమావాస్య చీకట్లను పారద్రోలి, వెలుగులు నింపే దీపావళి కళ తప్పుతోంది. ఏటా బాణసంచా ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఈ ఏడాది 15 నుంచి 20 శాతం వరకు ధరలు పెరిగాయని వ్యాపారస్థులు చెబుతున్నారు. పిల్లలు, పెద్దలు ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి టపాకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నెల్లూరు నగరంలో వీఆర్సీ క్రీడామైదానమే కాకుండా, ఈసారి బయట ప్రాంతాల్లోనూ బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతించారు. జీఎస్టీ ఇతర కారణాలతో బాణసంచా ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి.
పిల్లల సరదా కోసం తమ బడ్జెట్‌కి అనుగుణంగా టపాకాయలు కొనుగోలు చేస్తున్నారు. కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు ఇలా అన్నింటి ధరలు కొండెక్కాయి. గతంలో 1500 రూపాయలవి కొనుగోలు చేస్తే కుటుంబమంతా ఆనందంగా పండుగ చేసుకునేవాళ్లమని, ఇప్పుడు మూడు వేల రూపాయలు వెచ్చించినా కూడా కొనలేని పరిస్థితి నెలకొందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదల కారణంగా బాణసంచా అమ్మకాలు సక్రమంగా సాగడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పెరుగుతున్న బాణాసంచా ధరలను అదుపు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.