వైసీపీలో వర్గపోరు - మంగళగిరిలో పోటాపోటీగా పార్టీ కార్యాలయాలు ప్రారంభం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2023, 7:20 PM IST
Differences between YCP leaders in Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతలు తమతమ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉంది. అలాగే, తాడేపల్లిలో మరో రెండు కార్యాలయాలు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాయి. దొంతి రెడ్డి వేమారెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవితో ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలకు చేరువ కావడానికే కొత్త కార్యాలయం ప్రారంభించినట్లు తెలిపారు. పార్టీ కార్యాలయం ఏర్పాటుపై వస్తున్నవన్నీ వదంతులే అని వేమారెడ్డి పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఎవ్వరికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారనే అంశంపై స్పష్టత లేదని వేమారెడ్డి తెలిపారు. వైసీపీ నాయకత్వం ఎవరి పేరు సూచిస్తే వారి గెలుపుకోసం కృషి చేస్తామని వేమారెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యకర్తలను విస్మరించి ఏకపక్షంగా పనిచేస్తున్నారని కొంతమంది వైసీపీ నాయకులు బాహాటంగా విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీసీ నేతకు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో పోటీ చేసే అభ్యర్థిని కనీసం మూడు నెలల ముందుగా ఎంపిక చేయాలని నేతలు పేర్కొన్నారు. వైసీపీ నేతల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే కార్యకర్తలు టీడీపీలోకి వెళ్తున్నారని, నేతలు స్పందించి వలసలు పెరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.