Deputy CM Rajanna Dora: నిన్న అలా.. నేడు ఇలా.. రాజన్నదొర వ్యాఖ్యలు - పార్వతీపురం మన్యం జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
Rajanna Dora explained his comments on settlers: ఈ మధ్య తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో డిప్యూటీ సీఎం రాజన్నదొర దిద్దుబాటు చర్యలకు దిగారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్లో జగనన్నకి చెబుదాం.. ప్రారంభ కార్యక్రమానికి హాజరైన రాజన్నదొర విలేకరులతో మాట్లాడారు. మన్యం జిల్లా సాలూరు మండలం కొట్టిపరువు పంచాయతీ కేంద్రంలో ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేసిన కామెంట్లపై ఆయన వివరణ ఇచ్చారు. స్థానికేతరులు ఈ ప్రాంతానికి వచ్చి జిల్లా అభివృద్ధిలో సహకరిస్తున్నారని తెలిపారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ప్రాంతాల అభివృద్ధిలో కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఆ విషయంలో అధిగమించేందుకు ఆలోచన చేస్తున్నామే తప్ప తాము ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. కొంతమంది తాను చెప్పింది కాకుండా.. వేరేలా విష ప్రచారం చేస్తున్నారని రాజన్నదొర వెల్లడించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అభివృద్ధిలో మరింత పారదర్శకత ఉంటుందన్నారు. ప్రతి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.
రాజన్నదొర అసలేమన్నారంటే..: ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం చేస్తున్న సెటిలర్లు భారీ వాహనాలను తిప్పుతుండడంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారుతున్నాయి. ఇలా పాడైన వాటిని బాగు చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ముందుకు రావడం లేదు. కొట్టు పరువు పంచాయితీలో రోడ్లు వేయాలని చూస్తే ఓ సెటిలర్ రోడ్డు వేయకుండా ఆపారు.. అది సరికాదు అని.. గిరిజనులకు న్యాయం చేసేందుకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ ప్రాంతాన్ని షెడ్యూల్ ఏరియాగా ప్రకటిస్తే ఎక్కువగా నష్టపోయేది సెటిలర్లే అని రాజన్న దొర పేర్కొన్నారు. గిరిజన గ్రామాల్లో రోడ్లు వేసినా, వంతెనలు కట్టినా.. గిరిజనులకు ఉపయోగం తక్కువ.. సెటిలర్లకు వినియోగం ఎక్కువగా ఉందని రాజన్న దొర అన్నారు.