సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన డాల్ఫిన్.. చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
🎬 Watch Now: Feature Video
A Huge Dolphin Washed Ashore: పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యానికి తోడు.. ఇతర వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. వీటితో పాటు సముద్రపు నీళ్లలో ప్లాస్టిక్ పేరుకుపోయి జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీనివల్ల సముద్రంలో నివసించే చేపలు, రొయ్యలు, పీతలు వంటివి మృత్యువాత పడుతున్నాయి. ఇది రానురాను మరింత పెరుగుతోందని.. శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. కాలుష్య నివారణకు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఫలితం లేదంటూ వాపోతున్నారు.
ఇదే క్రమంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెం సముద్రతీరానికి ఓ భారీ డాల్ఫిన్ మృత కళేబరం కొట్టుకొచ్చింది. సుమారు పది అడుగుల పొడవున్న డాల్ఫిన్ మృత్యువాత పడి ఒడ్డుకు చేరడంతో చుట్టుపక్కల ప్రజలు చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. సముద్ర తీరంలో ఓఎన్జీసీ కార్యకలాపాలు, సముద్ర జలాల కాలుష్యం వల్ల ఇటీవల చాలా తాబేళ్లూ మృత్యువాత పడ్డాయి. సముద్ర తీరానికి డాల్ఫిన్ కళేబరం కొట్టుకు రావడం ఇది రెండోసారి. దీంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యంపై ప్రజల్లో చైతన్యం రావాలని కోరుతున్నారు.