Daggubadu Sarpanch Video on Votes Cancellation: 'మేము చనిపోయాం సార్.. మా ఓట్లు తొలగించండి..!'
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2023, 1:50 PM IST
Daggubadu Sarpanch Video on Votes Cancellation: ఓట్ల తొలగింపు వ్యవహారంలో జరుగుతున్న వింత ఘటనలు.. అవకతవకలు ఏవిధంగా సాగాయో చెప్పకనే చెబుతున్నాయి. 44 మంది చనిపోయిన వాళ్లే తమ ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేసుకోవటం.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఇది ఎక్కడో కాదు బాపట్ల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై దగ్గుబాడు అధికార పార్టీ సర్పంచ్ గేరా రవీంద్రనాథ్ ఠాగూర్ ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఓట్ల గుర్తింపులో చనిపోయినవారు, వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవాళ్లను బీఎల్ఓలు గుర్తించాలని కోరారు. గ్రామంలో ఉన్న వ్యక్తుల ఓట్లు తొలగించడం వల్ల గ్రామాల్లో ఇబ్బందులు, గొడవలు ఎదురవుతాయని దగ్గుబాడు సర్పంచ్ ఆరోపించారు. ఊళ్లో ఉన్న వాళ్ల ఓట్లు తొలగిస్తుంటే చూస్తు ఊరుకోమని, ఇప్పటికే ఒక్క దగ్గుబాడు గ్రామంలోనే 82 మంది తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. 44 మంది చనిపోయిన వాళ్లే తమ ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేసుకున్నట్లుగా అధికారులు చూపించడం విచిత్రంగా ఉందని చెప్పారు. ఇప్పటికైనా ఓట్లు తొలగింపు అక్రమాలు ఆపాలని.. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేస్తానని గేరా రవీంద్ర నాథ్ హెచ్చరించారు.