Case Registered Against Those who Deleted Votes: అధికార పార్టీ ఆధ్వర్యంలో ఓట్లు తొలగింపు ప్రక్రియ.. బతికున్నా చనిపోయినట్లుగా దరఖాస్తులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 2:09 PM IST
Case Registered Against Those who Deleted Votes: రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా టీడీపీకి సంబంధించిన వారి ఓట్లు వేల సంఖ్యలో తొలగిస్తున్నారు. ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉండి.. భార్యకు లేకుండా చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. ఎంతో కాలంగా ఒకే చిరునామాలో ఉంటున్న వారి పేర్లను సైతం ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారు. బతికున్న వారి ఓట్లు గల్లంతు చేసి, చనిపోయిన వారిని మాత్రం కొనసాగిస్తున్నారు అధికార పార్టీ నాయకులు వీటిపై టీడీపీ నాయకులు ఎన్నికల కమీషన్కి ఫిర్యాదు చేస్తున్నారు.
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికల నమోదు అధికారి ఫిర్యాదు మేరకు ఫారం 7 దరఖాస్తులు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేశారు. పర్చూరు, యద్దనపూడి చిన్నగంజాం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.. పర్చూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించేందుకు నిబంధనల విరుద్ధంగా ఫారం 7 దరఖాస్తులు అధికార పార్టీ ఆధ్వర్యంలో చేశారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా తప్పుడు దరఖాస్తులు సమర్పించారని ఏలూరి ఆరోపణ చేయగా ఎన్నికల నమోదు అధికారి వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.