Bombs in Nandyal: శాప్ ఛైర్మన్ బైరెడ్డి అనుచరుడి ఇంట్లో నాటుబాంబులు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
🎬 Watch Now: Feature Video
Bombs in YSRCP Leader House: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలో వైసీపీ నేత అనుచరుడి ఇంట్లో నాటు బాంబులు కలకలం రేపాయి. ముచ్చుమరి గ్రామంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరుడు నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా సమన్వయకర్త మధు ఇంటి పైనుంచి పదికి పైగా బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటిపై ఉన్న నీటి ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లగా.. ట్యాంకులో బాంబులు ఉన్నట్లు గుర్తించిన మధు.. పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలిపాడు. ఇంటిపై ఉన్న ట్యాంకులో మూట కట్టి.. అందులో బాంబులను ఉంచినట్లు గుర్తించారు. స్థానిక ఎస్సై నాగార్జున సిబ్బందితో వచ్చి మూటను పరిశీలించి బాంబులుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు బాంబులను స్వాధీనం చేసుకుని.. దీనిపై మధును పోలీసులు ప్రశ్నించగా.. బాంబులు తమ ఇంటిపై ఉన్న ట్యాంకులోకి ఎలా వచ్చాయో తెలియదని ఈ విషయాన్ని కనిపెట్టాలని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో బాంబులు ఎక్కడ నుంచి వచ్చాయి, నీటి ట్యాంకులో ఎవరు పెట్టారు అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.