నడి సంద్రంలో బోటులో అగ్ని ప్రమాదం - 11 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్స్
🎬 Watch Now: Feature Video
Boat Fire Accident in Kakinada Cost : కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నడి సంద్రంలో ఉండగా అందులోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు. వారు వెంటనే కాకినాడ తీరంలో గస్తీ నిర్వహిస్తున్న కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారం చేరవేశారు. దీంతో సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మత్స్యకారులను కాపాడారు.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లే సమయంలో భోజన అవసరాల కోసం నిత్యావసర సరుకులు, గ్యాస్ సిలిండర్ తదితర వస్తువులను వెంట తీసుకెళ్తుంటారు. వేటకు విరామం ఇచ్చే సమయంలో బోటులో వంట చేసుకుని భోజనం చేస్తారు. ఎప్పటిలాగే అలా వెళ్లిన 11 మంది మత్స్యకారులు వేట పూర్తి చేసుకొని తిరిగి వస్తుండగా బోటులో గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కోస్టు గార్డు సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే మత్స్యకారులు మంటల్లో చిక్కుకోవడమో లేక వాటి తీవ్రతకు సముద్రంలో దూకి ప్రాణాలు కోల్పోవడమో జరిగేదని పలువురు పేర్కొన్నారు.