బీటెక్ రవి హత్యకు పోలీసుల కుట్ర - కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు : ఎంపీ సీఎం రమేష్
🎬 Watch Now: Feature Video
BJP MP CM Ramesh reacts on the arrest of BTech Ravi: పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జి బీటెక్ రవిని ఈనెల 14న పోలీసులు కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించారంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఆరోజు బీటెక్ రవిని పోలీసులు కిడ్నాప్ చేసి.. మూడు గంటల పాటు ఓ చీకటి గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. బీటెక్ రవి అరెస్ట్ వార్తలు మీడియాలో ప్రసారం కావడంతో.. వల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలిపారు. కడప జైల్లో రిమాండ్ లో ఉన్న బీటెక్ రవిని... ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు. ఆ రోజు జరిగిన ఘటనను బీటెక్ రవి ద్వారా తెలుసుకున్న సీఎం రమేష్... జైలు బయట మీడియాకు అన్ని విషయాలు వెల్లడించారు.
సీఐ అశోక్ రెడ్డి బృందం బీటెక్ రవిని కిడ్నాప్ చేసినట్లు సీఎం రమేష్ తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే అంశంపై కేంద్రం హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని సీఎం రమేష్ తెలిపారు. బీటెక్ రవిని కిడ్నాప్ చేసి బెదిరించడమే కాకుండా... పులివెందులలో పార్టీ కార్యాలయం ఎందుకు కట్టావని ప్రశ్నించారన్నారు. వచ్చే ఎన్నికల్లో వివేకా కుమార్తె సునీత, లూధ్రా పోటీ చేస్తున్నారా... దానికి మీరు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారా అనే విషయాలను పోలీసులు ప్రశ్నించారన్నారు. పోలీసుల కాల్ డేటా బయటికి వస్తే మరిన్ని విషయాలు బహిర్గతం చేస్తామన్నారు. బతికి ఉంటే కదా నువ్వు పులివెందులలో పోటీ చేసేది... ఇప్పుడే చంపేస్తామని పోలీసులు బెదిరించినట్లు తనకు బీటెక్ రవి చెప్పారని సీఎం రమేష్ మీడియాకు వెల్లడించారు. 14న జరిగిన ఘటనపై తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్న ఎంపీ... బీటెక్ రవి ఫోన్ ను తీసుకున్న పోలీసులు డేటా కూడా డౌన్ లోడు చేసుకున్నారని ఆక్షేపించారు. మీడియాకు సమాచారం తెలియకపోతే చంపేసేవారని సీఎం రమేష్ వెల్లడించారు. త్వరలోనే సీఐ అశోక్ రెడ్డి బండారాన్ని ఆధారాలతో బయట పెడతామని చెప్పారు.