న్యాయమూర్తులు, గవర్నర్లకు లేవు రాచమర్యాదలు! ఇంటెలిజెన్స్ చీఫ్‌కు మాత్రం దగ్గరుండి చూస్తోన్న పోలీసులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 4:20 PM IST
|Updated : Nov 4, 2023, 4:38 PM IST
AP Surveillance Department Officer Violated Rules: ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా దేవాలయాల నిబంధనల విషయంలో.. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వీఐపీల పేరుతో ఆలయాల నిబంధనలను ఉల్లంఘిస్తూ.. భక్తులకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో నిబంధనలను నీళ్లు వదులుతూ రాష్ట్ర నిఘా విభాగం అధికారి సీతారామాంజనేయులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Devotees Fire on Surveillance Officer: రాష్ట్ర నిఘా విభాగం అధికారి సీతారామాంజనేయులు కుటుంబ సమేతంగా శనివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి విచ్చేశారు. ఆలయ నిబంధనల ప్రకారం.. మాడ వీధుల్లో వాహనాలు ప్రవేశించడాన్ని నిషేధించారు. కానీ, సీతారామాంజనేయులుకు చెందిన మూడు వాహనాలు మాడవీధులను దాటుకొని ఆలయం వద్దకు వెళ్లాయి. గతేడాది మంగళగిరిలో పర్యటించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వాహనాన్ని మాడవీధుల్లోకి రాకుండా అధికారులు అడ్డగించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు.. ఆలయ దర్శనానికి వచ్చిన సమయంలో కూడా వారి వాహనాలను అధికారులు బారికేడ్ల వద్దే నిలిపివేశారు. కానీ, సీతారామాంజనేయులు విషయంలో మాత్రం.. పోలీసులు దగ్గరుండి వాహనాలను లోపలికి పంపడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఆలయ ఈవో రామకోటరెడ్డిని వివరణ కోరగా.. తనకేమి సంబంధం లేదని చెప్పారు.